సీఎం అయిన కొన్ని గంటలకే విజయ్ సంచలనం.. ఆ నియోజకవర్గానికి రాజీనామా..
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి విజయ్ రాజీనామా చేశారు. ఆయన పోటీ చేసి విజయం సాధించిన మరో నియోజకవర్గం పెరంబూర్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే విజయ్ తన రాజీనామా సమర్పించారని మంత్రులు కేఏ సెంగోట్టయ్యన్, పీ వెంకటరామన్ ద్వారా అసెంబ్లీ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు లేఖను పంపించినట్లు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసి రెండు చోట్లా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక కొద్దిసేపటి క్రితమే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ అర్లేకర్. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయనతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అటు విజయ్ ప్రమాణస్వీకారానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ కీలక ప్రసంగం నిర్వహించారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీపై తొలి సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలోని మహిళల భద్రతపై రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తూ సీఎం సంతకం చేశారు. వీటితోపాటు రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా సీఎం విజయ్ సంతకం పెట్టారు.

విజయ్ కేబినెట్ లో మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం విజయ్ వద్ద హోం, ప్రజాపాలన శాఖలు ఉన్నాయి. అలాగే ఆధవ అర్జున్ - క్రీడలు, ఎక్సైజ్ శాఖ, సెంగొట్టయాన్ - పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD), వెంకట్రామన్ - పాఠశాల విద్యాశాఖ, ఎన్. ఆనంద్ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నిర్మల్ కుమార్ - విద్యుత్ శాఖ, రాజమోహన్ - ఆదిద్రవిడ సంక్షేమ శాఖ, అరుణ్ రాజ్ - కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించారు. అయితే కీర్తన, టీకే ప్రభులనూ మంత్రివర్గంలోకి విజయ్ తీసుకున్నారు. కానీ వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు.












Click it and Unblock the Notifications