బందరులో ఎన్టీఆర్ వర్సెస్ వాజ్ పేయి..! రచ్చ రచ్చ..!
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఎన్టీఆర్, వాజ్ పేయీ పేర్ల వివాదం తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఇందులో టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే పట్ఠణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు నిరసనకు దిగారు.
మచిలీపట్నంలోని న్యూహౌసింగ్ బోర్డు వద్ద దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ నిర్మాణానికి తాజాగా స్థానిక బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వారు అక్కడే ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ లో ఆ విగ్రహం తీసేసి వాజ్ పేయ్ విగ్రహం తయారు చేయించి పెట్టాలని భావించారు. ఇందుకోసం వాజ్ పేయ్ విగ్రహ నిర్మాణానికి శంఖుస్థాపనకు ప్లాన్ చేశారు. దీన్ని చివరి నిమిషంలో టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

దీంతో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద టీడీపీ వర్సెస్ బీజేపీ వివాదం నెలకొంది. ఈ క్రమంలో 2014లోనే ఎన్టీఆర్ మార్గ్ నామకరణం చేసి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేసినట్లు టీడీపీ నాయకులు బీజేపీ నేతలకు గుర్తుచేశారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో హౌసింగ్ బోర్డు రింగ్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక వైపు బీజేపీ నాయకులు మరో వైపు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని పరిస్దితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని నియంత్రిస్తున్నారు.

రాష్ట్రంలో అధికార టీడీపీ, కేంద్రంలో అధికార బీజేపీ మధ్య ఇలా విగ్రహాల విషయంలో వివాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇరు పార్టీల మధ్య రాష్ట్రంలో గతంలో ఎక్కడా ఇలాంటి వివాదం చోటు చేసుకోలేదు. కేవలం పార్టీలు, నేతల మధ్య వివాదాలు కాస్తా ఇప్పుడు విగ్రహాల వరకూ రావడంతో బందరులో ఏం జరుగుతుందని ఇరు పార్టీల సీనియర్ నాయకులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications