ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్.. ఎక్కడెక్కడ ఎంత శాతం అంటే ?
తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు స్థానాలకు.. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్చి 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30 శాతం పోలింగ్ నమోదు అయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి ఎన్టీఆర్ జిల్లాలో 61.99 శాతం నమోదు అయింది.

నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు వెల్లడించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లను తరలించి... గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో వైసీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ ప్రధానంగా పోటీలో నిలిచింది. ఇక తెలంగాణలో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో బరిలో నిలవగా.. బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గులాబీ నేతలను ఆందోళనకు గురి చేసింది.












Click it and Unblock the Notifications