ఆ సమాచారం ఇస్తే 50వేల రూపాయల నగదు ప్రోత్సాహకం!
లింగ నిర్ధారణ నేరమని, లింగ నిర్ధారణ చేసేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తుంది. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలు అవుతున్నా, లింగ నిర్ధారణ చేసే కేంద్రాలపైన కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా పడిపోతుంది.
లింగ నిర్ధారణ చేసే కేంద్రాల విషయంలో కఠిన చర్యలు
కడుపులో ఉన్న బిడ్డ ఆడనా, మగా అనేది తెలుసుకోవటం, ఆడపిల్ల అయితే గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవటం వలన బాలికల నిష్పత్తి బాగా తగ్గుతుంది. ఈ క్రమంలో బాలికల నిష్పత్తి బాగా తగ్గిన హనుమకొండ జిల్లాలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లింగ నిర్ధారణ చేసే కేంద్రాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ నిర్ధారణల కట్టడికి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఆ పని చేస్తే 50 వేల రూపాయల నగదు ప్రోత్సాహకం
జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు ఎవరికైనా ఖచ్చితమైన సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించాలని, తమకు ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 50 వేల రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటన చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఖచ్చితమైన సమాచారం ఉంటే 6300030940 నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఎక్కడైనా మొబైల్ స్కానింగ్ మిషన్ లతో లింగ నిర్ధారణ చేస్తే సమాచారం ఇవ్వాలి
గతంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 3 స్కానింగ్ మిషన్ లను సీజ్ చేయడం జరిగిందని, ఎక్కడైనా మొబైల్ స్కానింగ్ మిషన్ లు గాని, లింగ నిర్ధారణ చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం ఉంటే తప్పక తమ దృష్టికి తీసుకు రావాలని డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. లింగ వివక్షత,లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం గురించి అవగాహన కార్యక్రమాలతో పాటు చట్టం ఉల్లంగించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎంహెచ్‌ఓ తెలియ చేశారు.
ఎంటిపి చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితులలోనే అబార్షన్
క్షేత్ర స్థాయి లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్ లు అప్పటికే ఒకరు లేదా ఇద్దరు ఆడ పిల్లలను కలిగి ఉన్న వారికి అవగాహన కలిగించడమే కాకుండా వారి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలిపారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సి ఎంటిపి చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ప్రత్యేక పరిస్థితులలో చట్టం నియమాలకు లోబడి అబార్షన్ కు అవకాశం ఉందన్నారు.
ఆడబిడ్డ అని తెలుసుకుని అబార్షన్ చేయించుకోవటం నేరం
అంతే కానీ పుట్ట బోయే బిడ్డ ఆడ పిల్ల అని తెలుసుకొని అబార్షన్ కు పాల్పడటం శిక్షార్హం అన్నారు. మరి ముఖ్యంగా నాటు పద్దతులు, స్వంత వైద్యo, అర్హత లేని వైద్యుల వద్ద కు వెళ్ళడం ద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications