మీరు ట్రైలర్ చూపిస్తే.. అధికారంలోకి మేం వస్తే సినిమా చూపిస్తాం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నేతల పైన వేధింపులు పెరిగాయని పదేపదే వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడినా తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
ఏపీలో నిరంకుశ పాలన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన పైన ఎవరైనా వ్యంగంగా మాట్లాడినా సరే వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసిపి లీగల్ సెల్ నాయకుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారికి కచ్చితంగా సినిమా
పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన పైన వ్యాఖ్యలు చేసిన ఆయన రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసిపి నాయకులు కచ్చితంగా వారికి సినిమా చూపిస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే నేరమా
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు తమ పార్టీ నాయకులను వేధింపులకు గురిచేస్తూ వారిని తరిమేస్తున్నారు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజు పల్లెకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రస్తుతం చంద్రబాబు పాలన పైన వ్యంగంగా వ్యాఖ్యలు చేస్తే అది నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కోసం పిటీషన్
చంద్రబాబు పాలన పైన వ్యంగ్యాస్త్రాలు సంధించినందుకు పోలీసులు ఆయనను తీసుకెళ్లారని, తను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశానని పొన్నవోలు తెలిపారు. వైసిపి నాయకులను కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్న పోలీసులు వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఏడాది క్రితం జరిగిన మహిళ హత్య కేసును ఇప్పటివరకు తేల్చలేదని, పోలీసులు తలదించుకోవాలి అని విమర్శించారు.












Click it and Unblock the Notifications