పరివర్తన పేరుతో యూపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు: సీఎం క్యాండిడేట్ గా: క్లియర్ టార్గెట్
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కలిసి నూతన థర్డ్ ఫ్రంట్ ను ప్రకటించారు. దీనికి 'సామాజిక పరివర్తన్ మోర్చా' అని పేరు పెట్టారు. రాబోయే ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 403 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆజాద్ పేరును ప్రతిపాదించారు ఒవైసీ.
లక్నోలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, సమాజ్ వాది పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశామని, తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలను చేర్చుకుంటామని అన్నారు. బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని, ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని ఒవైసీ, ఆజాద్ చెప్పారు.

ప్రస్తుత పాలనలో రాష్ట్రంలో దళితులు, ముస్లింలు, వెనుకబడిన తరగతుల ప్రజలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని చంద్రశేఖర్ ఆజాద్ ఆరోపించారు. శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం అణగారిన వర్గాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణే తమ ధ్యేయమని పేర్కొన్నారు. బీజేపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తమ కూటమిలో చేరవచ్చని ఆహ్వానించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన బాటలోనే తమ సామాజిక పరివర్తన్ మోర్చా పయనిస్తుందని నేతలు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో స్వంత రాజకీయ బలం లేని వర్గాలు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని, అందుకే అణగారిన ప్రజలు ఓటు ద్వారా తమ సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు. 2027 నాటికి రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ మార్పు తీసుకువస్తామని, బలహీన వర్గాలను అధికార పీఠం వైపు నడిపిస్తామని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఒవైసీ ఎండగట్టారు. కులం, మతంతో పాటు చివరికి.. పండుగల పేరుతో కూడా బీజేపీ రాజకీయాలుచేస్తోందని, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటాయని, నిరుద్యోగం ప్రబలిపోయిందని, గ్రామీణ ప్రజలకు కనీస వసతులు కూడా అందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీపై ఉందని అన్నారు.
ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారానే రాబోయే ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందుతామని ఒవైసీ, ఆజాద్ స్పష్టం చేశారు. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 'సామాజిక పరివర్తన్ మోర్చా' ఆవిర్భావం ప్రధాన రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ పొత్తు దళిత, ముస్లిం ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తట్టుకుని, క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టడంలో ఈ కొత్త కూటమి విజయవంతమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.
సమాజ్‌వాదీ పార్టీ ముందుకు తెచ్చిన వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక (పీడీఏ) సమీకరణానికి ఈ కొత్త పొత్తు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. దళిత, ముస్లిం ఓటు బ్యాంకుపై గణనీయమైన ప్రభావం చూపగల నేతలుగా చంద్రశేఖర్ ఆజాద్, ఒవైసీకి పేరుంది.














Click it and Unblock the Notifications
