CCTV Video: ‘హ్యాపీ దీపావళి.. అందరినీ చంపేస్తా’.. 16 రౌండ్ల కాల్పులతో ఎన్నారై దారుణ హత్య!
CCTV Video: పండగ పూట విషాదం నింపేలా కేవలం పార్కింగ్ స్థలం విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో సింగపూర్‌కు చెందిన 42 ఏళ్ల ఎన్నారై, టెక్ మహీంద్రా మాజీ ఉన్నతోద్యోగి పరంజీత్ ధన్‌కర్‌ను అతని పొరుగింటి వ్యక్తి అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. నవంబర్ 6న ధనత్రయోదశి రోజు రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
మేనల్లుడి పెళ్లి కోసం వచ్చి మృత్యుఒడికి..
సింగపూర్‌లోని ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న పరంజీత్ ధన్‌కర్ గతంలో టెక్ మహీంద్రాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇటీవల తన మేనల్లుడి వివాహానికి హాజరయ్యేందుకు ఈ ఘటన జరిగిన ఒక రోజు ముందే ఇండియాకు వచ్చారు. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21సీలో ఉన్న ఒకే అపార్ట్మెంట్ భవనంలో మొదటి అంతస్తులో పరంజీత్ ధన్‌కర్ కుటుంబం నివాసం ఉంటుండగా.. మూడో అంతస్తులో నిందితుడు మోను శర్మ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

వివాదానికి అసలు కారణం ఇదే!
పోలీసుల విచారణలో ఇరు కుటుంబాల మధ్య గత కొద్ది రోజులుగా పార్కింగ్, ఇతర చిన్న విషయాలపై విభేదాలు ఉన్నట్లు తేలింది. నిందితుడు మోను శర్మ కుమారుడు తమ పెంపుడు కుక్కను పార్కింగ్ ప్రదేశంలో మలవిసర్జనకు తీసుకెళ్లడంపై పరంజీత్ ధన్‌కర్ కుమారుడు సూర్య పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై గత నాలుగైదు రోజులుగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. హత్యకు 5 రోజుల ముందు కూడా మోను శర్మ, పరంజీత్ ధన్‌కర్ కుమారుడు సూర్యను దుర్భాషలాడినట్లు అధికారులు తెలిపారు.
పిలిచి మరీ కాల్పులు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు
నవంబర్ 6 రాత్రి టీ-షర్టు, లోయర్ ధరించిన మోను శర్మ, పార్కింగ్ సమస్యపై మాట్లాడాలనే నెపంతో మొదటి అంతస్తులో ఉన్న పరంజీత్ ధన్‌కర్‌ను కిందకు పిలిచాడు. ఆ సమయంలో పరంజీత్ ధన్‌కర్ కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. తనపై దాడి చేసేందుకు ముగ్గురు వ్యక్తులను పంపావంటూ మోను శర్మ పరంజీత్ ధన్‌కర్‌పై నిరాధార ఆరోపణలు చేశాడు. అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురైన పరంజీత్ ధన్‌కర్.. తనకు ఏమీ తెలియదని చేతులు జోడించి వేడుకుంటూనే ఉన్నాడు. అంతలోనే నిందితుడు తన కుడి జేబులోనుంచి లైసెన్స్‌డ్ పిస్టల్ తీసి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.
రీలోడ్ చేసి మరీ ఉన్మాదం.. 'హ్యాపీ దీపావళి' అంటూ అరుపులు
కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే నిందితుడు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో, భయంతో వణికిపోయిన పరంజీత్ ధన్‌కర్ కుమారుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. రక్తపు మడుగులో ఉన్న పరంజీత్ ధన్‌కర్ ప్రాణభయంతో బిల్డింగ్ ప్రధాన గేటు మూసి బయటకు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయినా వదలని మోను శర్మ.. అతడిని వెంబడించి మళ్లీ కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరంజీత్ ధన్‌కర్ ధైర్యంగా నిందితుడి కాలర్ పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇద్దరి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. ఇంతలో ఓ మహిళ సాయం కోసం కేకలు వేస్తూ భవనం బయటకు పరిగెత్తింది.
కాల్పులు ఆగిపోయామని భావిస్తున్న సమయంలో మోను శర్మ ఏమాత్రం కనికరం లేకుండా తుపాకీని మళ్లీ రీలోడ్ చేసి కిందపడి ఉన్న పరంజీత్ ధన్‌కర్ వద్దకు వచ్చి మరో నాలుగు రౌండ్లు కూల్చాడు. మొత్తం 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు జరపగా.. పరంజీత్ ధన్‌కర్ శరీరంలోకి 8 నుంచి 9 బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు పరంజీత్ ధన్‌కర్‌ను బూతులు తిడుతూ.. "హ్యాపీ దీపావళి .. అందరినీ చంపేస్తా, అందరినీ చంపేసి వెళ్తా" అంటూ ఉన్మాదంతో అరుస్తూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దారుణ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
Sensational CCTV footage has emerged showing the murder of Paramjit Dhankhar, former Asia Head at Tech Mahindra, in Faridabad on the night of Dhanteras.Monu Sharma summoned Paramjit and fired 15 to 16 rounds in rapid succession using his licensed pistol. https://t.co/QE5520f7zH
— Nitish K Yadav (@NITISHK22069083) November 12, 2026
గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్
ఘటన తర్వాత తన కుటుంబంతో కలిసి పరారైన మోను శర్మను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మర గాలింపు చేపట్టి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సూరజ్‌కుండ్ పోలీసు అధికారి ప్రహ్లాద్ కుమార్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుంచి పలు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకుంది. నిందితుడు ఉపయోగించిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను సీజ్ చేసి తదుపరి విచారణ జరుపుతుననట్లు పోలీసులు తెలిపారు.













Click it and Unblock the Notifications
