233 రగడ: తెలుగులో దేవినేని, బాబుని ఏకేసిన కేసీఆర్
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదన విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ రాజుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రులు సోమవారం పోటా పోటీగా స్పందించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు మాట్లాడారు.
కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన చుక్క నీటిని వదులుకోమని హరీష్ రావు తేల్చి చెప్పారు. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తే అది తప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారని మండిపడ్డారు. గత ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు.
చంద్రబాబు మోసాన్ని ఆంధ్రా, తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఎంత స్థాయికైనా నీటిని వినియోగించుకుంటుందని చంద్రబాబు నాడు హైకోర్టులో చెప్పారని గుర్తు చేశారు. కృష్ణా నదిలో ఏపీ ప్రభుత్వం వాటా ఎంత అని ప్రశ్నించారు. విద్యుత్, నీటి విషయంలో పరకాల ప్రభాకర్‌కు అవగాహన లేదన్నారు.

అవసరమైతే కాపీలు కావాలంటే పరకాలకు, దేవినేని ఉమామహేశ్వర రావుకు పంపిస్తామన్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో పరకాల విద్రోహకర్త అన్నారు. నాడు బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ జీవో 69 ఫాలో కాలేదన్నారు. ఆంధ్రా పాలకుల వల్లే ఇప్పుడు మా రైతులు నష్టపోతున్నారని, కాంగ్రెస్‌కు ముందుచూపు లేక విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రలో కట్టించారన్నారు.
శ్రీశైలం జల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం వాదనలు అన్నీ కాకి లెక్కలేనన్నారు. జీవో 107 గురించి గొప్పగా మాట్లాడుతున్న ఏపీ సర్కారు, ఆ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమహ అదే 107 జీవోను సవరిస్తూ వైయస్ జారీ చేసిన మరో జీవో 233 విషయాన్ని ఎందుకు దాస్తున్నారని నిలదీశారు.
జీవో 107కు సవరణగా వచ్చిన జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు 34 టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాత మిగతా నీటిని 834 అడుగుల వరకు వాడుకోవచ్చన్నారు. దానిని దేవినేని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. వైయస్ ప్రభుత్వం వల్లనే ఈ సవరణ జారీ అయిందని దేవినేని గొప్పగా చెప్పుకొన్నారని, ఇప్పుడు మాట మార్చి మళ్లీ 107 జీవో గురించి మాట్లాడుతున్నారన్నారు.
డెల్టా, రాయలసీమ నేతలు తమ తమ ఆధిపత్యం కోసం శ్రీశైలం నీటితో ఆఢుకున్నారని, తెలంగాణను నిలువునా దగా చేశారన్నారు. ఏపీ సీఎంలు వారి అవసరాలకు అనుగుణంగా జీవోలు విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధీటుగా స్పందించిన దేవినేని
ఏపీ ప్రభుత్వం పైన తెరాస నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన 233 జీవోను తెలుగులో చదివి వినిపించారు. నాడు అల్మట్టీ డ్యాం విషయంలో 107 జీవో పైన చంద్రబాబు ధర్నా చేస్తే, కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
విద్యుత్ కంటే సాగు, తాగునీరు అవసరమని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. జీవోల గురించి మాకు పాఠాలు చెబుతానన్న హరీష్ రావు మా చెవిలో పూవులు పెట్టవద్దని ఎద్దేవా చేశారు. సమస్యలను కృష్ణా రివర్ బోర్డు దృష్టికి మరోసారి తీసుకు వెళ్తామని చెప్పారు.
సాగర్ నుండి పోతిరెడ్డిపాటు వరకు కుట్ర: కృష్ణా బోర్డు చైర్మన్‌కు కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, వివక్షకు గురయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌కు తెలిపారు. ఆయన చైర్మన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ వివక్షకు గురయిందని, ఇప్పటికీ కుట్రలకు గురవుతోందని ఆయనకు వివరించారు. చైర్మన్‌తో భేటీ అయిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.
50 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నదీ జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని వివరించినట్లు చెప్పారు. తెలంగాణ ఇన్నేళ్లలో పూర్తి వివక్షకు, అన్యాయానికి గురైందని తెలిపారు. జల దోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయం చేయాలని చైర్మన్‌ను కోరినట్లు కేసీఆర్ తెలిపారు.
కృష్ణా నది పైన నిర్మించిన సాగర్ నుండి పోతిరెడ్డిపాడు వరకు అంతా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 29న జరిగే బోర్డు సమావేశంలో తెలంగాణకు జరిగిన అన్యాయం పైన చర్చ జరగాలని కోరారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సి ఉందన్నారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా కుట్రలు చేయడంతో కొరత ఏర్పడిందని తెలిపారు. ఆంధ్రా జల దోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ సాధించినందుకు బాబు మాపై కక్ష కట్టారన్నారు. నదీ జలాల కేటాయింపు, వినియోగంలో తమకు అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. తెలంగాణలోని ఎన్నో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ఆంధ్రాలో ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టులు లేక కృష్ణా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామన్నారు.
ఆంధ్రా నేతలు నీళ్లు తరలించుకుపోయారు తప్ప తెలంగాణ అవసరాలను గుర్తించలేదన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు తప్పన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ ఉద్యమం నడిచిందన్నారు. నీళ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమన్నారు.












Click it and Unblock the Notifications