KA Paul: తనకు ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పేసిన కేఏ పాల్..! విశాఖ ఎంపీ డ్యూటీ మొదలు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఓట్లు పోలయ్యాయో గణాంకాలు కూడా విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ ఓట్లు పోలైన సీటుగా నిలిచిన విశాఖ పార్లమెంట్ స్ధానంలో ఫలితాలపై అభ్యర్ధుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ ఇదంతా ఏమీ పట్టనట్టుగా విశాఖ ఎంపీ సీటులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన కేఏ పాల్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఫలితం తేల్చేశారు.
విశాఖ ఎంపీ సీటులో మొత్తం 14 లక్షల ఓట్లు పోలయ్యాయని, ఇందులో తనకు 10 లక్షల ఓట్లు పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధి కేఏ పాల్ వెల్లడించారు. ఇందులో 4 లక్షల క్రైస్తవ ఓటర్లు, 2 లక్షల యువ ఓటర్లు, స్టీల్ ప్లాంట్ ఓటర్లు మరో 2 లక్షల మంది, చివరిగా మరో రెండు లక్షల బడుగు, బలహీన వర్గాల ఓట్లు తమకు పోలయ్యాయని కేఏ పాల్ వెల్లడించారు. దీంతో తన గెలుపు లాంఛనమే అని పాల్ తెలిపారు.

తనకు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల ఓట్లు తనకు పోలయ్యాయని తన అంతర్గత సర్వేలో తేలిందని కేఏ పాల్ తెలిపారు. కాబట్టి ఇక విశాఖపట్నం ఎంపీగా తాను గెలిచినట్లే భావించి పని మొదలుపెడుతున్నట్లు పాల్ వెల్లడించారు. 100 రోజుల్లో తాను ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలా మూడు పాయింట్ల మీద పనిచేస్తానన్నారు.
విశాఖ అభివృద్ధి కోసం తాను వ్యూహాలు రూపొందించుకున్నట్లు తెలిపారు. దీంతో పాల్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications