చంద్రబాబు. పడిన కష్టం కనిపిస్తోంది: ప్రత్యేక హోదాపై జవదేకర్ దాటవేత
విజయవాడ: కేంద్రమంత్రి, బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ కృష్ణా నదిలో పుష్కర పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. పుష్కర ఏర్పాట్లను కొనియాడారు. జవదేకర్‌తో పాటు ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్ రావు, పలువురు బిజెపి, టిడిపి నేతలు పుష్కర స్నానం ఆచరించారు.
ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడారు. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. నదుల అనుసంధానం సంకల్పం నెరవేరాలని తాను కోరుకున్నానని చెప్పారు. పుష్కరాల కోసం సీఎం చంద్రబాబు పడిన కష్టం ఏర్పాట్లను, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలను చూస్తుంటే తెలుస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఎంతో ముందు నుంచే పక్కా ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు పరచడంలో విజయం సాధించారని ప్రశంసించారు. తనను పుణ్య కార్యానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి ఉందన్నారు. పుణ్యస్నానం అనంతరం ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా, అంతకుముందు జావదేకర్ ఉదయం కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసేందుకు వచ్చిన ఆయనకు మంత్రులు గంటా, నారాయణ, సీఎం రమేష్ తో పాటు పలువురు టిడిపి, బిజెపి నేతలు స్వాగతం పలికారు.
ప్రత్యేక హోదాపై జవదేకర్ ట్విస్ట్
విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో.. ప్రత్యేక హోదాపై విలేకరులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు సాధిస్తుందన్న నమ్మకం తనకుందని, పుష్కర సంకల్పంగా, నాణ్యమైన విద్య అందరికీ అందాలని కోరుకున్నానని అన్నారు. ఏపీని ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, హోదా గురించి మాత్రం మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications