వివేకా నుదిటిపై గాయాలు - సీబీఐకి ప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం : ఆ రోజు ఏం జరిగిందంటే..!!
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పలువురిని విచారించింది. అందులో బాగంగా వారి వాంగ్మూలాల్లో ఏం చెప్పారనే అంశాలు ఒక్కక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డి సీబీఐకి ఏం చెప్పారనే అంశం బయటకు వచ్చింది. గతేడాది ఆగస్టు 16న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలమిచ్చారు. వివేకా మృతదేహం బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉండటం చూసినా..తాను ఆయన నుదుటిపైన గాయాలను గమనించలేదని సీబీఐకి చెప్పారు.

శంకర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు
హత్య జరిగిన రోజున 2019 మార్చి 15న ఉదయం 6.30కు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయారని తనకు చెప్పారన్నారు. ఎలాగని చెప్పలేదని పేర్కొన్నారు. దీంతో తాను వివేకా ఇంటి వద్దకు వెళ్లానని..నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లగా అక్కడ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఉన్నారని వివరించారు. మరెవరూ అక్కడ ఉన్నట్లుగా చూడలేదని చెప్పుకొచ్చారు. బెడ్ రూమ్ లో రక్తం చూసి బాత్ రూమ్ వైపు వెళ్లినట్లుగా చెప్పారు. రక్తపు మడుగులో వివేకా మృతదేహం పడి ఉందన్నారు. రక్తపు వాంతులు అయి ఉంటాయని తాను భావించినట్లు వాంగ్మూలంలో వివరించారు. తాను దాదాపుగా 15-20 నిమిషాలు అక్కడే ఉన్నానని..ఆ సమయంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించాలనే ఆలోచన రాలేదన్నారు.

ఆస్పత్రికి వెళ్లాకే తెలిసింది
ఆ తరువాత తిరిగి ఉదయం 11.30కు తాను వివేకా ఇంటి వద్దకు వెళ్లానని చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారని తెలిసిందన్నారు. మాజీ ఎంపీ సాయి ప్రతాప్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు. గుండెపోటుతో మరణించారనే ప్రచారం ఎవరు ప్రారంభించారో తనకు తెలియదని చెప్పారు. వివేకా హత్యకు గురయ్యారన్న సంగతి ఆసుపత్రికి వెళ్లాకే తెలిసినట్లు ప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో స్పష్టం చేసారు. ఇక, వివేకా ఇంట్లో పనిమనిషిగా చేసిన రాగిరి లక్ష్మీదేవీ స్టేట్ మెంట్ సైతం సీబీఐ రికార్డు చేసింది. అందులో వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం ప్రారంభించింది కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని లక్ష్మీదేవి వెల్లడించారు.

తొలుత అలా చెప్పింది వారే..
వివేకా బెడ్‌రూమ్‌లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనకు సూచించారని..అయితే, వాటిని శుభ్రం చేయలేక తనకు వాంతులు వచ్చాయని వివరించారు. బెడ్‌షీట్‌పై కూడా రక్తపు మరకలు కనిపించాయని చెప్పారు. వివేకా ఇంట్లో జిమ్మీ అనే పెంపుడు కుక్క ఉండేదన్నారు. ఆరేడేళ్లుగా ఆ కుక్క ఆ ఇంట్లో ఉందని వివరించారు. ఆ మార్గంలో ఎవరైనా గుర్తుతెలియనివారు వస్తే వారి వాహనాల్ని వెంబడిస్తూ అరిచేదని... ఒక రోజు జిమ్మీ చనిపోయి కనిపించిందని చెప్పారు. వివేకా హత్య సంఘటనకు 20-25 రోజుల ముందు ఇది చోటుచేసుకుందని..జిమ్మీ ఎలా చనిపోయిందో తెలియదని తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications