ట్విస్ట్‌లు: టీడీపీకి జగన్ పార్టీ 'రెబల్' ఝలక్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రకాశం జిల్లా పరిషత్తు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మెజార్టీ వచ్చింది. కానీ, ఆ పార్టీ అభ్యర్థి చైర్మన్ కాలేదు. జగన్ పార్టీ నుంచి కొంతమంది జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. దీంతో టీడీపీ మెజార్టీలోకి వచ్చింది. చైర్మన్ ఎన్నిక జరిగే సమయానికి టీడీపీకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.
దీంతో, చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ తరఫున గెలిచి చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈదర హరిబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో చైర్మన్‌గా విజయం సాధించారు. అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య ఒక్క ఓటు తేడాతో ఆయన విజయం సాధించారు.
జిల్లా పరిషత్తు ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన షాక్ ఇది. ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జడ్పీటీసీలంతా విప్‌ను ధిక్కరించారు. కనక వారిని అనర్హులను చేయాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చే అవకాశముండదు.
పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఈదర హరిబాబును అనర్హుడిగా ప్రకటించాలంటూ టీడీపీ నోటీసు ఇవ్వవచ్చు. అదే జరిగితే తమ పార్టీ తరఫున గెలిచి టీడీపీకి ఓటేసిన ముగ్గురు జడ్పీటీససీలపై వేటు వేయాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నోటీసు ఇవ్వొచ్చు. మొత్తం నలుగురినీ అనర్హులను చేసేస్తే మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ దక్కే అవకాశముంది.

ప్రకాశం
ప్రకాశం జిల్లాలో 56 మంది జడ్పీటీసీలున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో 31 మంది వైయస్సార్ కాంగ్రెస్, 25 మంది టీడీపీ తరఫున గెలుపొందారు. అయితే, ముగ్గురు జగన్ పార్టీ జడ్పీటీసీలు టీడీపీకి జైకొట్టారు. టీడీపీ, వైసీపీ బలం 28కి చేరుకుని సరిసమానమైంది.

ప్రకాశం
ఈ నెల ఐదో తేదీన జడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎన్నిక వాయిదా పడింది. దానిని తిరిగి ఆదివారం నిర్వహించారు. రెండు పార్టీలకూ చెరి 28 మంది బలం ఉండడంతో లాటరీ పద్ధతి ద్వారా చైర్మన్‌ను ఎంపిక చేయాల్సి వస్తుందని అంతా భావించారు. కానీ, అనూహ్య పరిస్థితుల మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో జడ్పీటీసీ బలం తగ్గిపోయింది.

ప్రకాశం
ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు పెండింగులో ఉన్న అట్రాసిటీ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జడ్పీటీసీ రంగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీ సమావేశం ప్రారంభ సమయానికి టీడీపీ శిబిరంలో ఆ పార్టీ తరపున గెలిచిన 25 మంది, అలాగే జగన్ పార్టీ నుండి వచ్చిన ముగ్గురు కలిపి మొత్తం 28 మంది జడ్పీటీసీలు ఉన్నారు. కానీ, జగన్ పార్టీ బలం 27కు పడిపోయింది.

ప్రకాశం
తమ పార్టీ అభ్యర్థి జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీడీపీ తరఫున చైర్మన్ పదవిని ఆశించి విఫలమైన ఈదర హరిబాబుకు గాలం వేసింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామంటూ రహస్య మంతనాలు జరిపింది. దీనికి హరిబాబు అంగీకరించడంతో హైడ్రామాకు తెరలేచింది.

ప్రకాశం
ముందుగా ఇచ్చిన విప్ ప్రకారం టీడీపీ తరపున చైర్మన్ అభ్యర్థిగా మన్నె రవీంద్ర పేరును ఆ పార్టీ జడ్పీటీసీలు ప్రతిపాదించారు. కో ఆప్షన్ ఎన్నికలో పాల్గొని, టీడీపీ సభ్యులకు ఓటు కూడా వేసిన టీడీపీ జడ్పీటీసీ ఈదర హరిబాబు ఇక్కడ అడ్డం తిరిగారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రకాశం
అదే సమయంలో, స్వతంత్ర అభ్యర్థి హరిబాబును బలపరుస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జడ్పీటీసీలు ప్రకటించారు. ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి హరిబాబుకు 28 ఓట్లు, రవీంద్రకు 27 ఓట్లు వచ్చాయి.

ప్రకాశం
టీడీపీ శిబిరంలో ఉన్న హరిబాబు మినహా మిగతా 27 మంది రవీంద్రకు మద్దతు తెలపగా, జగన్ పార్టీ పక్షాన ఉన్న 27 మంది హరిబాబుకు మద్దతు తెలిపారు. తన ఓటుతో హరిబాబు జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జడ్పీటీసీ నూకసాని బాలాజీ గెలుపొందారు.












Click it and Unblock the Notifications