ఉన్న పీకే చాలడని.. ఇంకో పీకేను తెచ్చుకున్న చంద్రబాబు: పవన్‌ను నమ్ముకుంటే అధోగతే
Prashant Kishor: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ సాయంత్రం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రశాంత్ కిశోర్.. ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో బిహార్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. సొంతంగా పార్టీని నెలకొల్పారు.

అలాంటి ప్రశాంత్ కిశోర్.. ఉన్నట్టుండి విజయవాడలో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు.
ఈ భేటీపై మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోన్నారు. గతంలో ఇదే చంద్రబాబు.. అదే ప్రశాంత్ కిశోర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. ప్రశాంత్ కిశోర్ తోక కత్తిరిస్తానని, బిహార్ రాజకీయాలు ఏపీలో చెల్లనివ్వనంటూ చంద్రబాబు చేసిన విమర్శల వీడియోలు, కామెంట్లను ఇప్పుడు మళ్లీ ప్రస్తావిస్తోన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అధికారం పంచుకోవట్లేదని, 2024 ఎన్నికల్లో తాము గెలిస్తే- అయిదు సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ నారా లోకేష్ చేసిన ప్రకటనల నుంచి జనం దృష్టిని మరల్చడానికే చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ అంశాన్ని తెర మీదికి తెచ్చారని అంటున్నారు. ఆ పీకేతో పని కావట్లేదనే ఉద్దేశంతో ఈ పీకేను తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేస్తోన్నారు.

పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోమని, జనసేనతో అధికారాన్ని పంచుకోబోమంటూ స్పష్టంగా తేల్చి చెప్పారు నారా లోకేష్. దీనివల్ల జనసేనలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి. ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. నారా లోకేష్ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది జనసేన క్యాడర్.
చివరికి- పవన్ కల్యాణ్ అంటే అమితంగా అభిమానించే మాజీ మంత్రి హరిరామ జోగయ్య సైతం అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నారా లోకేష్ చేసిన ప్రకటనకు వివరణ ఇవ్వాలంటూ నేరుగా ఆయన పవన్‌కే బహిరంగ లేఖ రాశారు. కాపులను ముఖ్యమంత్రిని చేస్తేనే తాము జనసేతో ఉంటామనే విషయాన్ని తేల్చి చెప్పారు.
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల దుమారం నుంచి దృష్టిని మరల్చడానికే ప్రశాంత్ కిశోర్ వ్యవహారాన్ని చంద్రబాబు తెర మీదికి తెచ్చారని చెబుతున్నారు. ఉన్న పీకే చాలడని, బిహార్ నుంచి మరో పీకేను తెచ్చుకోవడం వెనుక చంద్రబాబు రాజకీయ వ్యూహం ఇదేనని సమాచారం.












Click it and Unblock the Notifications