నేటి నుంచి.. తిరుమల కేంద్రంగా
లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వైదిక క్రతువులకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు అయిదు రోజుల పాటు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణ యజ్ఞం, పర్జన్య శాంతి, కారీరిష్టి యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. సకల జీవకోటి మనుగడను కాంక్షిస్తూ సాగే ఈ యజ్ఞాల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ వేద పండితులు పాల్గొననున్నారు. ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సృష్టిలోని ప్రతి జీవి మనుగడకు నీరు అత్యవసరం. ఈ నేపథ్యంలో వరుణుడు, మేఘాధిపతి పర్జన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రాచీన కాలం నుంచి ఇలాంటి యాగాలను నిర్వహించడం సనాతన హిందూ సంప్రదాయంలో వస్తోంది. కరువు కాటకాలు పారదోలి, సకాలంలో రుతుపవనాలు ప్రవేశించి, పంటలు బాగా పండాలని ఈ క్రతువులను తలపెట్టింది టీటీడీ. అయిదు రోజుల పాటు ధర్మగిరి ఆవరణ ప్రాంగణం మొత్తం వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.

ఈ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:00 వరకు అంకురార్పణతో యజ్ఞ పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు అర్చకులు. 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ధర్మగిరిలో వరుణ యజ్ఞం, కారీరిష్టి, పర్జన్య శాంతి హోమాలను ఆగమోక్తంగా చేపడతారు. వీటితో పాటు రామాయణ సుందరకాండ, విరాటపర్వ పారాయణ ఘట్టాలు ఉంటాయి.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8:00 వరకు అగ్నిహోత్ర అనుష్ఠానం, వివిధ వేద శాఖలకు చెందిన పండితులతో ప్రత్యేక వేద పారాయణాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మహా పూర్ణాహుతితో ఈ అయిదు రోజుల యజ్ఞ క్రతువులు అత్యంత వైభవంగా ముగుస్తాయి. రుష్యశృంగ ధ్యానం, విరాటపర్వ పారాయణం వంటి హోమ ప్రక్రియలు మేఘాలను ఆకర్షించి వర్షాలను కురిపించడానికి దోహదపడతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విశేష యాగాల నిర్వహణలో భాగంగా ధర్మగిరిలోనే కాకుండా గోగర్భం డ్యామ్ వద్ద కూడా ప్రత్యేక జపతాపాలను నిర్వహించబోతోండటం విశేషం. జలవనరులు ఎప్పుడూ సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో మంత్ర పఠనాల కోసం టీటీడీ ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసింది. వైదిక విజ్ఞానాన్ని సజీవంగా ఉంచడం, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు సక్రమంగా అందించడంలో తిరుమల ధర్మగిరి వేద పాఠశాల కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ప్రధాన యాగశాలగా ఎంచుకుంది.













Click it and Unblock the Notifications