శ్రీవారి లడ్డూ విషయంలో ఆ వార్తలను నమ్మొద్దు: టీటీడీ
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో కొనసాగుతోంది. సోమవారం 77,085 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. వారిలో 33,766 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.61 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. 3.84 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.06 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కాగా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించింది టీటీడీ. ఆ వీడియోను నమ్మొద్దని సూచించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కూడా నిరాధారమైనవని వివరించింది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై దుష్ప్రచారం సాగిస్తోన్నారని, ఇది సరికాదని టీటీడీ వ్యాఖ్యానించింది.

ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోన్నామని టీటీడీ వివరించింది. లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేస్తోన్నామని, ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ కఠిన ప్రమాణాలను పాటిస్తోన్నామని పేర్కొంది.
ఈ విధానంలో లడ్డూ తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండబోదని, భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని టీటీడీ స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని తెలిపింది.
శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది.













Click it and Unblock the Notifications