Data Centre Jobs: డేటా సెంటర్లతో భారీ ఉద్యోగాలు రావా? తేల్చేస్తున్న నిపుణులు..!
మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ డేటా సెంటర్ల మాట వినిపిస్తోంది. ముఖ్యంగాా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డేటా సెంటర్లను (Data Centres) రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలోని విశాఖపట్నంలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ తో పాటు మరిన్ని డేటా సెంటర్లు ఇక్కడ రాబోతున్నాయి. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు వేగంగా పెరుగుతుండటంతో డేటా సెంటర్ల రంగంలోకి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. అయితే వేల కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ మెగా ప్రాజెక్టులు నేరుగా పెద్ద సంఖ్యలో ఉపాధిని కల్పిస్తాయా లేదా అన్న దానిపై దేశంలో చర్చ జరుగుతోంది.
డేటా సెంటర్లు అనేవి డిజిటల్ మౌలిక సదుపాయాలు మాత్రమే తప్ప, సాధారణ పరిశ్రమల తరహాలో భారీ మానవ వనరులు అవసరమయ్యే ఫ్యాక్టరీలు కావని నిపుణలు చెప్తున్నారు. వీటి పూర్తిస్థాయి నిర్వహణకు చాలా పరిమిత సంఖ్యలోనే సిబ్బంది అవసరమవుతారు. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు (Jobs) ఇక్కడ సృష్టించడం ఎవరికీ సాద్యం కాదు. కాబట్టి డేటా సెంటర్లను వ్యూహాత్మక డిజిటల్ అవసరాల కోసం నిర్మించే వనరులుగా చూడాలి కానీ, వాటి ద్వారానే నేరుగా భారీ ఉద్యోగాలు వస్తాయని ఆశించలేమని నిపుణులు తేల్చేస్తున్నారు.

విశాఖపట్నంలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 1 గిగావాట్ డేటా సెంటర్ లో ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రత్యక్షంగా 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి. దీని అనుబంధ వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ ఈ మధ్యే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర డిజిటల్ రంగాల్లోనే ఎక్కువ ఉపాధి లభించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో యూపీసీ వోల్ట్ సంస్థ 5వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనుకుంటున్న 100 మెగావాట్ డేటా సెంటర్ నిర్మాణ దశలో 3 వేల మందికి, నిర్వహణ దశలో కేవలం 800 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే CtrlS సంస్థ తెలంగాణలో 10 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే 400 మెగావాట్ క్లస్టర్ ద్వారా దాదాపు 3600 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

దీన్ని బట్టి చూస్తే డేటా సెంటర్ల ద్వారా లభించే అసలైన ఉపాధి ప్రయోజనాలు ఆ సర్వర్ గదుల బయటే లభిస్తాయని తేలిపోతోంది. ఈ మౌలిక సదుపాయాలను వాడుకుంటూ కొత్తగా ఏర్పాటయ్యే ఏఐ స్టార్టప్‌లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ శాశ్వత ఉపాధిని సాధిస్తాయి. వీటితో పాటు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కూలింగ్ సిస్టమ్ ఇంజనీర్లు, డేటా ఎనలిస్టుల రూపంలో దేశీయ డిజిటల్ రంగంలోనే దీర్ఘకాలిక ఉపాధి విప్లవం తలెత్తే అవకాశం బలంగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.














Click it and Unblock the Notifications