కుప్పంలో చంద్రబాబు పాచిక.. టీడీపీలో చేరబోతున్న జిల్లా అధ్యక్షుడు
చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి డాక్టర్ బీఆర్ సురేష్ బాబు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరబోతున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడే: కుప్పం మాజీ ఎమ్మెల్యే దొరస్వామినాయుడు కుమారుడే బీఆర్ సురేష్ బాబు. మూడుసార్లు కుప్పం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. స్వతహాగా ఆయన వైద్యుడు కావడంతో నియోజకవర్గంలోని ప్రజలందరితో నేరుగా పరిచయాలున్నాయి. టీడీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత కుప్పం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలను కలిశారు. చంద్రబాబుతో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. సురేష్ చేరికతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. సురేష్ తండ్రి దొరస్వామినాయుడు 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కుప్పంలో మార్పులు చేపట్టిన చంద్రబాబు: కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటీవలే మార్పులు చేర్పులు చేపట్టారు. నియోజకవర్గ కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పీఎస్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఆర్.చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారానికి మూడురోజులు అక్కడి నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

పోటాపోటీగా టీడీపీ, వైసీపీ వ్యూహాలు: ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలనే పట్టుదలను ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి కచ్చితంగా భరత్ గెలుస్తారని వైసీపీ ధీమాతో ఉంది. వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందానే దృక్పథాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే సురేష్ బాబు టీడీపీలో చేరబోతున్నారు.












Click it and Unblock the Notifications