NTR సొంత ఊళ్లో చంద్రబాబు, జగన్ పొలిటికల్ గేమ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ గ్రామం ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంటే.. తెలుగుదేశం పార్టీకి సొంత నియోజకవర్గం లాంటిది. అటువంటిచోట ఆ పార్టీ ఇంతవరకు గెలవలేదంటూ చిత్రంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఉప్పలేటి కల్పన
పామర్రు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా 2008లో ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డీవై దాస్ విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఏపీకి 2014లో ఎన్నికలు జరగ్గా వైసీపీ తరఫున పోటీచేసిన ఉప్పులేటి కల్పన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై గెలుపొందారు. అనంతర పరిణామాల్లో కల్పన టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన కల్పనపై మరోసారి వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 30వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా జిల్లా మొత్తం మీద ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గంగా పేరుపొందింది. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి.

పామర్రు కోసం వ్యూహరచనలో టీడీపీ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఈసారి గెలవాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది. వ్యూహంలో భాగంగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఉప్పులేటి కల్పనను చంద్రబాబు పక్కన పెట్టారు. వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాను ఇన్ ఛార్జిగా నియమించారు. రాజా నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి నాయకుణ్ని కలుస్తున్నారు. కానీ పార్టీని ఎలా బలోపేతం చేయాలో అర్థంకాక తడబడుతున్నాడు. ఇటీవలే విడుదలైన సర్వేల్లో కూడా మరోసారి ఇక్కడ వైసీపీదే గెలుపు అని తేలడంతో ఎన్టీఆర్ సొంత నియోజకవర్గాన్ని టీడీపీ కోల్పోయే ప్రమాదంలో పడింది. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా తమకు బలమైన అభ్యర్థి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారా?
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన దాస్ రాజకీయాలకు దూరం జరిగారు. రాష్ట్ర విడిపోయిన సమయంలో వైసీపీలో చేరారు. అక్కడ తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ అలకబూనారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో టీడీపీలోకికానీ జనసేనలోకికానీ ఆయన చేరతానే ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. తెలుగుదేశం, జనసేన పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరుపార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా డీవైదాస్ ను బరిలోకి దించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వర్ల రాజానే కొనసాగిస్తారా? లేదంటే డీవై దాస్ ను చేర్చుకుంటారా? అనూహ్యంగా చివరి నిముషంలో పార్టీ శ్రేణులు కోరుకుంటున్నట్లుగా ఎవరైనా బలమైన అభ్యర్థిని దించుతారా? అనేదానిపై కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అధినేత అభ్యర్థిని స్పష్టంగా ప్రకటిస్తేనే ఆ సందిగ్ధత తొలగిపోతుంది.












Click it and Unblock the Notifications