ఏపీ ప్రజలకు హెచ్చరిక జారీచేసిన వాతావరణశాఖ
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అసాధారణరీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వేడివాతావరణం కొనసాగుతోంది. కోస్తా, రాయలసీమల్లో వడగాడ్పులు వీచినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా అవుకులో 43.5 డిగ్రీలు నమోదైంది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేడి, తేమతో అసౌకర్యమైన వాతావరణం ఏర్పడనుంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైయస్‌ఆర్ కడప జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 64 మండలాల్లో అసాధారణ స్థాయిలో వడగాడ్పులు, మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బయటకు వెళ్లేవారు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆది, సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పగటివేళ పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైనే నమోదుకానున్నాయి. ముఖ్యమైన పనులు మినహా సాధ్యమైనంతవరకు ఇంటిలోనే ఉండాలని, దాహం వేయకపోయినా తరుచూ నీటిని తాగుతుండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు జారీచేసింది. అసాధారణ స్థాయిలో వేడి పెరగనున్న దృష్ట్యా వడగాడ్పుల ప్రభావానికి లోనుకాకుండా ఉండేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలని, ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చల్లటి నీరు, అది పడనివారు సాధారణ నీరు తరుచుగా తీసుకుంటుండాలని, ప్రతిరోజు 8 గ్లాసుల నీటికి తగ్గకుండా శరీరానికి అందిస్తుండాలని తెలిపింది.












Click it and Unblock the Notifications