అమరావతికి ద్రౌపది ముర్ము - ప్రధాని సైతం అదే రోజున : వైసీపీ అటే - టీడీపీ ఎటు..!!
ఏపీలో ఒకే రోజున ఇద్దరు కీలక వ్యక్తులు పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జూలై 4న భీమవరం పర్యటన ఇప్పటికే ఖరారైంది. హైదరాబాద్ నుంచి ప్రధాని మోదీ భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక, ఈ నెల 28న పారిస్ వెళ్లనున్న సీఎం తిరిగి జూలై 3న ఏపీకి తిరిగి రానున్నారు. జూలై 2,3 తేదీల్లో ప్రధాని హైదరాబాద్ లోనే ఉండనున్నారు.

ఇద్దరు ప్రముఖులు ఒకే రోజున
జూలై 4న భీమవరంలో ప్రధాని పర్యటన ముగిసే సమయానికి.. అమరావతికి ఎన్డీఏ నుంచి రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు. ఏపీ నుంచి ఎలక్టోరల్ కాలేజ్ ఓటర్లుగా ఉన్న రాజ్యసభ -లోక్ సభ సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలతోనూ సమావేశం అవుతారు. ఇప్పటికే మెజార్టీ సభ్యులు వైసీపీ నుంచి ఉన్నారు. అయితే, వైసీపీ ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వనున్న విషయం పైన అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

వైసీపీ మద్దతు ఖాయమేనా
కానీ, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ప్రధానితో సమావేశం సమయంలో ఈ అంశం చర్చకు వచ్చిందని.. ఎన్డీఏ అభ్యర్ధికే వైసీపీ మద్దతిస్తుందనే వాదన బలంగా వినిపించింది. వైసీపీ కి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ లో నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఇవి కీలకం. అయితే, ఒడిశా కు చెందిన గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్దిగా ఖరారు చేయటంతో బిజూ జనతా దళ్ సైతం మద్దతు ప్రకటించింది. ఇక..టీడీపీ కి ఓట్లు తక్కువగా ఉన్నా.. ఎవరికి మద్దతు ఇచ్చే అంశం పైన నిర్ణయం ప్రకటించ లేదు. టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ వైపే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీ అటు వైపే మొగ్గుకు ఛాన్స్
ఇతర పార్టీలకు ఓట్లు లేవు. ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రతిపాదిత బిల్లులు .. గతంలో రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి అభ్యర్ధి గెలుపుకు మద్దతు ప్రకటించిన వైసీపీ ఈ సారి గిరిజన మహిళను ఎన్డీఏ ఎంపిక చేయటంతో మద్దతు ఇస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా, పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి సైతం ఎన్డీఏ ఎస్టీ అభ్యర్ధిని బరిలోకి నిలిపిన తరువాత ఎవరైనా మద్దతిస్తారంటూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైసీపీ ఏం చేయబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక, ఒకే రోజున ఇద్దరు ప్రముఖుల పర్యటన ఏపీలో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.