విజయవాడకు రాష్ట్రపతి ముర్ము- అమ్మవారి దర్శనం, మహిళలతో సమావేశం..!!
రాష్ట్రపతి ముర్ము విజయవాడ పర్యటన ఖరారైంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన వేళ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి దర్శనం తరువాత రాష్ట్రపతి సరస్ మేళాలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలు, లఖ్‌పతి దీదీలతో కలిసి విందులో పాల్గొనేలా అధికారికంగా షెడ్యూల్ ఖరారు అయింది.
రాష్ట్రపతి ముర్ము విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 14వ తేదీన రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ముర్ము ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకోనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, నిమిషాల వారీగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం గన్న వరం విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి రాత్రి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. 15న పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్ మేళాలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

ఆ తరువాత స్వయం సహాయక సంఘాల మహిళలు, లఖ్‌పతి దీదీలతో కలిసి విందులో పాల్గొని మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సాయిప్రసాద్ ఆదేశించారు. అటు ఇంద్రకీలాద్రి పై దసరా వేళ భక్తుల రద్దీ పెరిగింది. రెండో రోజు అయిన ఈరోజున గాయత్రీదేవి ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఆలయ అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ పండితులతో సమావేశమయ్యారు. డీసీపీ కేజీవీ సరిత పర్యవేక్షణలో రాష్ట్రపతి పర్యటన సన్నాహాలపై ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్రపతి రెండు రోజులు విజయవాడ లో ఉండనుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
