అనకాపల్లి ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
'ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రాణనష్టం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందిస్తోంది' అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

కాగా, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఉన్నట్లు తెలిసింది.
చంద్రబాబు ఆదేశాలు
పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలోని బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications