అంతా వాళ్లు చెప్పినట్లే చేశా..! ఏసీబీ విచారణలో చేతులెత్తేసిన మరో జగన్ అధికారి..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దాదాపు రూ.2500 కోట్ల ఇసుక అక్రమాల విషయంలో ఏసీబీ విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అప్పట్లో గనుల శాఖ ఇసుక టెండర్లు, లీజులు, ఇతర అనుమతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో గత ప్రభుత్వ పెద్దల పాత్రను నిర్ధారించేలా కీలక ఆధారాలు లభిస్తున్నాయి. ఈ మేరకు అప్పట్లో గనుల శాఖ డీజీగా పనిచేసిన వీజీ వెంకటరెడ్డిపై జరుగుతున్న విచారణలో సంచలన అంశాలు వెల్లడవుతున్నాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాను కేవలం అమలు మాత్రమే చేశానని, అంతకు మించి తన పాత్రమే లేదని వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల్ని ధిక్కరించే పరిస్ధితి లేకపోవడంతో వారి ఆదేశాలు అమలు చేసినట్లు తెలిపారు. అఖిల భారత సర్వీసు అధికారిగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేకపోయినా అప్పట్లో మరో ప్రత్యామ్నాయం లేదని వెంకటరెడ్డి విచారణలో ఏసీబీకి చెప్పినట్లు తెలుస్తోంది.

తాజాగా ఇసుక తవ్వకాల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన వెంకటరెడ్డిని కోర్టు తొలుత రిమాండ్ కు, ఆ తర్వాత కస్టడీకి ఇచ్చింది. దీంతో అప్పట్లో ఇసుక తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించడం, వారికి లబ్ది చేకూరేలా తీసుకున్న పలు నిర్ణయాలపై వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే వేటికీ ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు మాత్రమే విన్నట్లు ఆయన చెప్తున్నారు. అయితే ఆ పెద్దలు ఎవరో కూడా ఆయన వెల్లడించలేదు. మీకు అన్నీ తెలుసు, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని వెంకటరెడ్డి తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఏసీబీ అధికారులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications