తొలుత లీకులు- ఆపై బ్రేకులు: తీవ్ర ఒత్తిడిలో చంద్రబాబు?
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది. ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది.
రాజకీయ చతురుడు..
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనేది కొత్తేమీ కాదు. మంచినీళ్లు తాగినంత సులువు. ఎలాంటి నిర్ణయాలనైనా సకాలంలో తీసుకునే మేధస్సు ఆయన సొంతం. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పరి. 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగారంటే చంద్రబాబు రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క పిలుపు ఇస్తే..
14 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలారు చంద్రబాబు. విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తన పేరును చరిత్రలో లిఖించుకోగలిగారు. చంద్రబాబు ఒక్క పిలుపు ఇచ్చినందువల్ల అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు.. తమ వేల ఎకరాలను ప్రభుత్వానికి అందించారు. అది ఆయన సత్తా.
చతికిలపడ్డారా?
ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు ఇప్పుడు చతికిలపడినట్టే కనిపిస్తోంది. చేష్టలుడిగినట్టయ్యారని అంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదనిపిస్తోంది పరిశీలకులకు.
కారణాలు ఇవే..
దీనికి కారణాలు, ఉదాహరణలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లో యూటర్న్‌లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ చెబుతున్న వారు చాలామందే ఉన్నారు. ఉచిత ఇసుక విధానం మొదలుకుని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకూ ఇదే తతంగం కనిపిస్తోంది.

జీవో జారీ..వెనక్కి
ఒకసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటోండటం, వాటిపై పునఃపరిశీలన చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తోండటం, తనకు తెలియకుండా జీవోలు, గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని సూచిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
కీలక అంశాలపై..
ఉచిత ఇసుక, తల్లికి వందనం, సీపీఎస్.. ఈ మూడూ కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపజేస్తోన్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు 1,400 రూపాయల మేర వసూలు చేస్తోంది ఆయన ప్రభుత్వం. ఇంత మొత్తం వైఎస్ జగన్ హయాంలో కూడా లేదు. జగన్ సర్కార్‌పై వ్యతిరేకత ఏర్పడటానికి ఇదీ ఓ కారణమైంది.
తల్లికి వందనం.. కాదు
తల్లికి వందనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ 15 వేల రూపాయలను ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. ఒకరికి అయితే ఎంత? ఇద్దరికి అయితే ఎంత? ముగ్గురికి అయితే ఎంత మొత్తం అవుతందని లెక్కలేసి మరీ ఊదరగొట్టారు జనాలను.
మెలికలు..
తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ జీవోలో మెలిక పెట్టారు. ఇసుక మీద ఎంత దుమారం చెలరేగిందో.. దానికి రెండింతల విమర్శలు వెల్లువెత్తాయి తల్లికి వందనం పథకంపై. దీనిపై జీవో ఇంకా విడుదల కాలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

విధానపరమైన అంశాలపై..
సీపీఎస్, జీపీఎస్ విషయంలోనూ అంతే. తనకు తెలియకుండా ఈ గెజిట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పించిందని చెప్పిన వాళ్లూ లేకపోలేదు. అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలే. అలాంటి వాటిల్లో కూడా చంద్రబాబుకు తెలియకుండా అధికారులు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారనుకుంటే నవ్వుకోక తప్పదనీ చెబుతున్నారు.
లీకులు..
తొలుత లీకులు ఇవ్వడం, దానిపై ప్రజల నుంచి వచ్చే స్పందనను గుర్తించండం, సానుకూలంగా ఉంటే ముందుకు వెళ్లడం, లేదంటే నాలుక మడతెయ్యడం ఆయనకు అలవాటేనని.. కీలకమైన అంశాలపై నిర్ణయాలను తీసుకోవడంలో చంద్రబాబు తటపటాయించడం, ఒత్తిడిని ఎదుర్కొంటోండటం సరికాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications