ఆమే పెద్ద దిక్కు?: రాయలసీమ బీజేపీ బాధ్యతలు పురంధేశ్వరికి!
రాబోయే రోజుల్లో రాయలసీమ బీజేపీకి ఆమె పెద్ద దిక్కుగా ఉంటారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
విజయవాడ: నిన్న మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో వినిపించిన మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి పేరు ఇప్పుడా జాబితా నుంచి తొలగించినట్లే కనిపిస్తోంది. భవిష్యత్తులో పురంధేశ్వరికి రాయలసీమ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాయలసీమలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆమె కదులుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అనంతపురం వెళ్లిన పురంధేశ్వరి.. పార్టీ కార్యకర్తలతో చర్చించారు. కిందిస్థాయిలో పార్టీని విస్తరించే సాధ్యాసాధ్యాలపై ఆమె ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు మాటెలా ఉన్నప్పటికీ.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రాయలసీమ బాధ్యతలు పురంధేశ్వరికి అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే సీమకు రాకపోకలు పెంచారు పురంధేశ్వరి.

ఇటీవల అనంతపురంలో పర్యటించిన సందర్భంగా మిత్రపక్షం టీడీపీపై బీజేపీ నేతలు పురంధేశ్వరికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో సఖ్యతతోనే మెదులుతున్నా.. ఆ పార్టీ నేతలుమాత్రం తమకు గౌరవం కల్పించడం లేదని పురంధేశ్వరితో నేతలు వాపోయారట.నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవుల్లో బీజేపీకి ఎటువంటి ప్రాధాన్యం కల్పించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే పార్టీ నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్న పురంధేశ్వరి అనంతపురం జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు సూచిస్తున్నారు. అనంతపురానికి అమృత్ పథకం కింద రూ.42 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ, సెంట్రల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజి అభివృద్ధికి నిధులు వంటివి కేంద్రం ఇచ్చినవేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం అనంతలో స్థానిక తాగు- సాగునీటి ప్రాజెక్టుల గురించి పురంధేశ్వరి నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమ బీజేపీకి ఆమె 'పెద్ద దిక్కు'గా ఉంటారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.












Click it and Unblock the Notifications