హోదా కుదరకపోతే ప్యాకేజీనే: పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదని అన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దు అని 14వ ఆర్థిక సంఘంతో ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. వారి చర్యలు మాత్రం అలాగే ఉన్నాయని పురంధేశ్వరి అన్నారు.

దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేకహోదా అడుగుతున్నాయని తెలిపారు. హోదా ఇవ్వడం కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్థానం ఉంటుందన్నారు.
ఆంద్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇప్పటికే రూ.4వేల కోట్లు ఇచ్చిందని.. 2019 నాటికి లోటు మొత్తాన్ని భర్తీ చేస్తుందని అన్నారు. హోదా అంశంపై ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు పట్టుబడుతున్న సమయంలో.. పురంధేశ్వరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా, పోలవరం భూసేకరణ, పునరావసంపై తమకు కొన్ని సందేహాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ సందేహాలను నివృత్తి చేస్తే నిధులు రీఎంబర్స్ చేస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. కేంద్రం ఏపీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications