టిడిపి పొత్తు: పురంధేశ్వరికి సీటు దక్కేనా, ప్రచారానికేనా
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరికి లోకసభ సీటు దక్కేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం టిడిపి, బిజెపి మధ్య పొత్తు ఖరారు కావడంతో సీమాంధ్రలో బిజెపికి ఐదు ఎంపీ సీట్లు ఇచ్చారు. అందులో విశాఖపట్నం, నర్సాపురం, రాజంపేట, తిరుపతి(ఎస్సీ), అరకు(ఎస్టీ)లు ఖరారైనట్లుగా తెలుస్తోంది.
ఆమె మొదటి నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ టిడిపి ఆ సీటును బిజెపికి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు విశాఖపట్నం సీటును ఇచ్చినప్పటికీ అక్కణ్నుంచీ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేస్తారని అంటున్నారు.

నర్సాపురం నుంచి రఘురామ కృష్ణం రాజు లేదా గోకరాజు గంగరాజును బరిలోకి దింపవచ్చని అంటున్నారు. రాజంపేట నుంచి శాంతా రెడ్డి, హరనాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల్లో ఒకరు పోటీ చేసే అవకాశముందట. మిగిలిన తిరుపతి, అరకు ఎస్సీ, ఎస్టీ స్థానాలు కావడంతో పురందేశ్వరికి సీటు సమస్య వచ్చి పడింది.
అయితే అరకు బదులు ఒంగోలు సీటు ఇవ్వాలంటూ బిజెపి డిమాండ్ చేస్తోంది. ఒకవేళ టిడిపి ఒంగోలు సీటును కేటాయిస్తే అక్కడి నుంచి పురందేశ్వరిని పోటీ చేయించే అవకాశముందంటున్నారు. ఒంగోలు ఇవ్వకపోతే పురందేశ్వరికి బెర్త్ దొరకడం కష్టమని అంటున్నారు. వెంకయ్య నాయుడు హామీతోనే ఆమె బిజెపిలోకి వచ్చారని, ఇప్పుడు ఆమెకు హామీ లేకుండా పోయిందంటున్నారు. పురంధేశ్వరికి సీటు లేకపోవడం వెనుక చంద్రబాబు లేకపోలేదనే వాదన కూడా ఉంది.
అయితే, పురంధేశ్వరి కోసం కంభంపాటి హరిబాబు పోటీ నుండి విరమించుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. టిడిపి ఒంగోలు సీటు ఇచ్చినా, హరిబాబు సీటును వదులుకున్నా పురంధేశ్వరికి అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అసలు పురందేశ్వరి ఈసారికి ఎక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. తగిన సీటు లేనందున ఆమె ప్రచారానికే పరిమితం అవుతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications