నేను ఎన్టీఆర్ కూతురిని, ఆదరించారు: పురంధేశ్వరి
రాజంపేట: కడప జిల్లా రాజంపేట లోకసభ స్థానంలో చేస్తున్న ప్రచారం బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీ రామారావు కార్డు వాడుతున్నారు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తానని ఆమె అన్నారు. ఆదివారంనాడు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
నందమూరి తారకరామారావు కూతురుగా రాయలసీమ ప్రజలు తనకొక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పురందేశ్వరి వెల్లడించారు. ఇక్కడి యువత అవకాశాలు లేక వలసలు పోతున్నారని, గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్లు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారని, ఇవన్నీ తమ దృష్టికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను ఏక కాలంలో పరిష్కరించగలమని వాగ్ధానం చేయడంలేదని, అయితే ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సంపూర్ణమైన కృషి చేస్తామని పురందేశ్వరి చెప్పారు.
రాజంపేట లోకసభకు ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి తన ప్రచారంలో వేగాన్ని పెంచారు. విజయం కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications