తెలంగాణపై ఒత్తిడి తెండి: బాబుకు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన ఆదివారం మండిపడ్డారు. శ్రీశైలంలో జల విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిలిపివేసే విధంగా కృష్ణాబోర్డు, కేంద్రంపై వత్తిడి తేవాలని, లేని పక్షంలో రాయలసీమ వ్యవసాయ ప్రయోజనాలు, తాగునీటి వ్యవస్ధ ఘోరంగా దెబ్బతింటాయని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు, ద్వంద్వ ప్రమాణాల వల్ల రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఏ విషయం పైనా ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. తుపాను బాధితులకు సహాయం చేయడం ప్రభుత్వం బాధ్యతని, దీనిని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసుకోవడం తగదన్నారు.
పంటల బీమా పథకం గురించి అడిగితే మంత్రులు ముఖం చాటేస్తున్నారన్నారు. మొత్తం రైతు రుణాలను మాఫీ చేస్తానని గొప్పలు చెప్పిన చంద్రబాబు రకరకాల ఆంక్షలు పెట్టి 30 వేల కోట్ల రూపాయలకు ఇప్పటికి తగ్గించారన్నారు. అలాగే లక్ష ఎకరాల్లో రాజధాని అని చెప్పి చివరకు 30 వేల ఎకరాలకు తగ్గించారన్నారు.

రాజధాని విషయంలో కూడా మొదటి నుంచి చంద్రబాబు ఇచ్చిన మాటపైన నిలబడి లేరన్నారు. ఇప్పటికీ రైతుల నుంచి భూమి సమీకరణ లేదా సేకరణ అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారన్నారు. పెనుతుపాను సహాయక చర్యల్లో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ విషయాన్ని తప్పించుకునేందుకు రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు.
చంద్రబాబు నాయుడు తాను పని చేయకుండా ఇతరులను తప్పు పడుతున్నారని మండిపడ్డారు. మాటలు తప్ప చేతలు చంద్రబాబులో కనిపించడం లేదన్నారు. రైతుల పైన చంద్రబాబు కక్ష కట్టినట్లున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, రాజధాని విషయంలో ఏమాత్రం స్పష్టత లేదన్నారు.
హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలో అర్బాటం, ప్రచారం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాజధాని విషయంలో సింగపూర్, చికాగో.. ఇప్పుడు నయా రాయపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్ సమస్య, తాజా రాజకీయాల పైన వారు సమావేశంలో చర్చించనున్నారు.
ఎస్పీఎస్ నెల్లూరులో ఏఐసీసీ కార్యవర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యవర్గ సమావేశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డితో పాటు 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications