హోంమంత్రి తానేటి వనితకు అన్నీ అగ్ని పరీక్షలే: వరుస ఘటనలతో మంత్రి సమర్ధతపై ప్రశ్న!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హోం మంత్రి తానేటి వనిత బాధ్యతలు చేపట్టిన నాటి నుండే హోం శాఖను గాడిన పెట్టటంలో విఫలం అవుతున్నారు అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మంత్రిగా పని చేసినా ఎదురుకాని సవాళ్లు, ఇప్పుడు హోం శాఖా మంత్రిగా ఎదుర్కోవలసి వస్తుంది. ఆమెకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదిలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఘటనలు తానేటి వనితకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. తానేటి వనిత సమర్ధతను ప్రశ్నిస్తున్నాయి.

విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటన .. హోం మంత్రికి సెగ
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హోం మంత్రి తానేటి వనిత రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని బాధ్యతలు చేపట్టిన తొలి నాడు చెప్పారు. అయితే తానేటి వనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మానసిక దివ్యాంగురాలి పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే గ్యాంగ్ రేప్ చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారం హోంమంత్రికి చిక్కులు తెచ్చిపెట్టింది.

రాష్ట్రంలో మహిళల రక్షణపై ప్రతిపక్షాల టార్గెట్
రాష్ట్రంలో మహిళల రక్షణ ఎక్కడ అని ప్రతిపక్షాలు ప్రశ్నించేలా చేసింది. విజయవాడ మానసిక దివ్యాంగురాలి గ్యాంగ్ రేప్ ఘటన ఏపీలో దుమారం రేపింది. టీడీపీ నేతల విమర్శలతో అటు హోం మంత్రికి, ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక ఈ వ్యవహారం ముగిసేలోపే మరో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపింది. అది మళ్ళీ హోం శాఖను, పోలీస్ వ్యవస్థను ప్రశ్నించింది.

విజయనగరం జిల్లా మహిళ దహనం ఘటన.. హోంమంత్రికి తలనొప్పి
విజయనగరం జిల్లాలో ఓ మహిళను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దుర్ఘటన కలకలం రేపింది. మహిళ ఎక్కడ నుండి వచ్చింది? అసలు ఏం జరిగింది? అనేది అంతు పట్టకుండా మహిళను దహనం చేసిన సంఘటన నేపథ్యంలో మళ్లీ హోం మంత్రి టార్గెట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, మహిళా హోంమంత్రిగా ఇటువంటి దాడులు ఘటనలు జరుగుతున్నా ఏం చేస్తున్నారని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
నారా లోకేష్ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. టిడిపి మహిళా నేతలు మహిళా మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అసమర్థ మంత్రులంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రేపల్లె అత్యాచార ఘటన .. మంత్రి వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్న టీడీపీ
ప్రస్తుతం మళ్ళీ రేపల్లె లోని రైల్వే స్టేషన్ లో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అటు హోం మంత్రి తానేటి వనిత కు ఊపిరాడనివ్వని ఒత్తిడికి గురి చేస్తుంది . మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపధ్యంలో స్పందించిన హోం మంత్రి వనిత బిడ్డల సంరక్షణా బాధ్యత తల్లులదే, తల్లులు నిర్లక్ష్యంగా ఉంటేనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రతీదానికి పోలీసులను, ప్రభుత్వాన్ని బాధ్యులను చెయ్యటం మంచిది కాదని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇక ఆమె వ్యాఖ్యల నేపధ్యంలో టీడీపీ ఆమె హోం మంత్రిగా అనర్హురాలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.

కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్న హోం మంత్రి తానేటి వనిత
తానేటి వనితకు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పటానికే తానేటి వనిత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ సమస్యలను , ప్రతిపక్ష పార్టీల విమర్శలను హోం మంత్రి అధిగమిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా తయారయింది.
టీడీపీ నేతలు మాత్రం హోం మంత్రి వనిత ను ఊపిరి ఆడనివ్వకుండా టార్గెట్ చేస్తుంటే ఆమె హోం శాఖను సమర్ధవంతంగా ఎలా ముందుకు తీసుకు వెళ్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో హోం మంత్రిగా పని చేసిన మేకతోటి సుచరిత కూడా హోం శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేదు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తానేటి వనిత సమర్ధతకు పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో ఆమె నెగ్గుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications