అన్న లాగే తమ్ముడు!: 'అధ్యయనం' లేకుండా దిగితే ఎలా?, పవన్‌పై ఇవీ విమర్శలు..
Recommended Video

విజయవాడ: ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన, వాటిని పరిష్కరానికి తమవంతు ఆలోచన తప్పనిసరి. ఇవేవి లేకుండా సమస్యలు విన్న ప్రతీసారి.. అధ్యయనం చేసి చెబుతానంటే ఆ నాయకుడి సమర్థత ఏపాటిదో జనం గమనిస్తారు.
ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ అధినేత చిరంజీవి కూడా ఇలాగే అభాసుపాలయ్యారు. మీడియా సమావేశాల్లో దేని గురించి ప్రశ్నించినా.. అధ్యయనం చేసి చెబుతానని అనేవారు. దీనివల్ల ఆయన అవగాహన స్థాయి ఏంటో తేలిపోయింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోను ఇదే రిపీట్ అవుతుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాంట్రాక్టు కార్మికుల:
విజయవాడ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విద్యుత్ ఒప్పంద కార్మికులు కలిసి.. తమ సమస్యలను విన్నవించారు. తమను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. 24వేల మంది ఒప్పంద కార్మికులం ఉన్నాం. ఇప్పుడు మా గురంచి పట్టించుకోవట్లేదు అని పవన్ తో విన్నవించారు.

అధ్యయనం చేయాలి?:
కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్ సమస్య 20 ఏళ్లుగా ఉందన్న పవన్.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీని గురించి అడగలేదా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ 7,114 మందిని రెగ్యులరైజ్ చేశారని, 2009ఎన్నికల తర్వాత మిగతావారిని రెగ్యులరైజ్ చేస్తామన్నారని, కానీ ఇంతలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారని తెలిపారు.
ఒప్పంద కార్మికుల సమాధానంపై స్పందిస్తూ.. 'కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యు లరైజ్ చేయడం అన్నదానిపై వివరంగా ఆధ్య యనం చేయాలి. ఇలాంటి అంశాలపై ప్రతి పక్షం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి' అని బదులిచ్చారు.

ప్రతిపక్షమే టార్గెట్?:
సమస్యలపై ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని పవన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్నట్లే వైసీపీ విఫలమైందనుకున్నా.. క్రియాశీలక రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా సమస్యలపై అవగాహన, వాటికి పరిష్కారం మార్గం చూపించే ఆలోచన పవన్ కు ఉండాలి. కానీ ఇవేవి ఆయనలో ఉన్నట్లు కనిపించడం లేదన్నది వైసీపీ వాదన. ఎంతసేపు తమపై నిందలతో సరిపెడుతున్నాడు తప్పితే తానేం చేస్తాడో ఎందుకు చెప్పట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

పవన్‌కు కౌంటర్?:
సమస్యలపై ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్న పవన్ వ్యాఖ్యకు ఒప్పంద కార్మికుల నుంచి కౌంటర్ రావడం గమనార్హం. గత అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ బహిష్కరించడం సరికాదంటూ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.

ఫాతిమా కాలేజీ విషయంలోను:
ఒక్క ఒప్పంద కార్మికుల విషయంలో మాత్రమే కాదు.. అటు ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యకు పరిష్కారం ఏంటనే దానిపై కూడా పవన్ తన ఆలోచన తెలియజేయలేకపోయారు. 'ఇది గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వస్తున్న సమస్య అనుకున్నాను' అన్న వ్యాఖ్యతో ఆయన అవగాహన స్థాయిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరిగి మీరంతా కాలేజీకి వెళ్తారని చెప్పిన పవన్.. అయితే ఎలా అన్నదానికి మాత్రం తనకు కొంత సమయం ఇవ్వండి అన్నారు.
ఏదైనా సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఒక క్రియాశీలక స్థానంలో ఉన్న వ్యక్తిగా దాని పరిష్కారానికి తనవంతుగా ఏదైనా ప్రతిపాదన చేయడం, లేక తన ఆలోచనను వ్యక్తం చేయడం పరిపాటి. కానీ పవన్ మాత్రం సమయమిస్తే ఆలోచిస్తా అన్న రీతిలో స్పందించడం బాధితులను నిరాశపరిచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications