వారికి టికెట్లిస్తే.. తెలుగుదేశం ఇంటికి వెళ్లడమే?
ఏపీ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. తన సహజశైలికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుసగా ఓటమిపాలవుతున్న సీనియర్లకు టికెట్ లేదని స్పష్టం చేశారు. తాజాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, అక్కడి నేతల పనితీరు, పార్టీ పరిస్థితి, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటూ సీటును ఆశిస్తున్న నేతలు.. తదితరాలపై ఆయన సర్వే నిర్వహింపచేశారు.

పార్టీ పరిస్థితిపై రాబిన్ శర్మ టీం సర్వే
తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా నియమితులైన రాబిన్ శర్మ టీం ఈ సర్వే చేపట్టింది. ఈ టీం రాష్ట్రమంతా క్షేత్రస్థాయిలో పర్యటించింది. కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్లు యువతను ఎదగనివ్వడంలేదని తెలిపింది. దీంతో యువతరం కూడా నిరాశకు గురవుతోంది. పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా సీటు దగ్గరకు వచ్చేసరికి మొండిచేయి మిగులుతోందంటూ నిర్వేదానికి గురవుతున్నారు. వీరిని ఎదగనివ్వకుండా చేస్తున్న సీనియర్లలో ఎక్కువమందికి వారి వారి నియోజకవర్గాల్లో సానుకూల పరిస్థితులు లేవని రాబిన్ శర్మ బృందం కుండబద్ధలు కొట్టినట్లు తేల్చింది. వారికి టికెట్లు ఇస్తే తెలుగుదేశం ఇంటికి వెళ్లడమేనని టీం స్పష్టం చేసింది.

నేతల పనితీరులో మార్పు రాకపోతే కష్టమే
దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదో మొహమాటం లేకుండా తేల్చేయబోతున్నట్లు సమాచారం. దీంతో టికెట్ తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న పలువురి నేతలకు ఇప్పుడు టికెట్ వస్తుందా? రాధా? అనే టెన్షన్ పట్టుకుంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల పరిస్థితులు లేవని, ఇదంతా స్వయం కృతాపరాధమేనని, నేతల పనితీరులో మార్పు వచ్చినప్పుడే పార్టీకి విజయావకాశాలుంటాయని తేల్చింది. సీనియర్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం బూత్ ఇన్ ఛార్జిలను కూడా నియమించుకోలేదని ఈ సర్వేలోని సారాంశం.

కొత్త ముఖాలను పరిచయం చేద్దామని..
చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కొత్త ముఖాలను రాజకీయ తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు. అయితే పార్టీ చేపడుతున్న బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో కొత్తవారు కూడా దూసుకుపోయేంత చురుగ్గా లేరని రాబిన్ బృందం వెల్లడించింది. ఏదేమైనప్పటికీ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతోపాటు నాయకులను కార్యోన్ముఖులను చేసి ముందుకు నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. దీనిపై బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications