జగన్ వచ్చినా.. పిఠాపురంలో పవన్ విజయం పక్కా; మెజార్టీతో సహా చెప్పిన రఘురామ కృష్ణంరాజు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి . ఒకపక్క చంద్రబాబు ప్రజా గళం పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే మరోవైపు వైయస్ జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్సుయాత్ర చేస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ప్రజలలోకి వెళుతూ ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు.
జనసేనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం
ఈసారి అత్యధిక సీట్లు సంపాదించి ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడుతున్న జనసేన సైతం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తుంది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో వ్యూహాత్మకంగా ఎన్నికల కురుక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండగా ఆయన పిఠాపురంలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను కలిసిన రఘురామ కీలక వ్యాఖ్యలు
మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవుతుండడంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడుతూ వస్తుంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించి తీరుతారని ఆయనను ఏ శక్తి అడ్డుకోలేదని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. టిడిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు.
దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న రఘురామ
పవన్ కళ్యాణ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళిపై ఆయన మాట్లాడారు. అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భేటీ పై మాట్లాడిన ఆయన అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు.
తన కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న రఘురామ
ఇక ఇదే సమయంలో తనకు పవన్ కళ్యాణ్ తోనూ, నాగబాబు తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంపై రఘురామ వ్యాఖ్యలు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని, ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ తిష్ట వేసినా పవన్ కళ్యాణ్ విజయం ఆగదని స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు 65 వేల ఓట్ల మెజారిటీ గ్యారెంటీ అని రఘురామ కృష్ణంరాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications