జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి - దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కు : సుప్రీంలో రఘురామ పిటీషన్...!!
వైసీపీ రెబల్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్ కేసులకు సంబంధించి మరో పిటీషన్ దాఖలు చేసారు. గతంలో జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, సీఎంతో పాటుగా ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో రఘురామ పిటీషన్లు దాఖలు చేసారు. వాటి విచారణ తరువాత పిటషన్లను తోసి పుచ్చుతూ సీబీఐ నిర్ణయం ఉత్తర్వలు ఇచ్చింది. దీంతో... ఆ కేసులో హైకోర్టులో అప్పీల్ కు వెళ్తూ అక్కడ రఘురామ పిటీషన్ దాఖలు చేసారు.

సుప్రీంలో రఘురామ తాజా పిటీషన్
ఇక, ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన విచారణలో ఉన్న కేసుల స్థితితో పాటుగా తాను చెబుతున్నట్లుగా ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా ప్రతివాదులను ఆదేశించాలని రఘురామ తన పిటీషనలో సుప్రీంను అభ్యర్దించారు. పదేళ్ల నుంచి ట్రయల్ కోర్టు అకారణంగా కేసు విచారణను వాయిదా వేసుకుంటూ వస్తోందన్నారు.

దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కయినట్లుగా
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కయినట్లు జగన్ ప్రవర్తన కనిపిస్తోందని రఘురామ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇందులో జగన్ తో పాటుగా కేసులు విచారిస్తున్న సీబీఐ..ఈడీలను ప్రతివాదులుగా చర్చారు. ముఖ్యమంత్రి జగన్ నిర్దోషిగా బయటకు రావాలనే ఉద్దేశంతోనే తాను ఈ పిటీషన్ దాఖలు చేసానని రఘురామ చెబుతున్నారు.

రాష్ట్రపతి పాలన విధించాలి
ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల పైన ఆయన స్పందించారు. చంద్రబాబు డిమాండ్ కు ఆయన మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావడానికి 356వ అధికరణను ప్రయోగించడం ఒక్కటే మార్గమని రఘురామరాజు స్పష్టం చేశారు. సీఐని కొట్టిన వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దీక్షపై సజ్జల చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.

సజ్జల పైనా కీలక వ్యాఖ్యలు
ఆయన వంటి సలహాదుల వల్లనే సీఎంకు చెడ్డ పేరు వస్తోందన్నారు. సజ్జల మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్..విజయ సాయి రెడ్డి పైన న్యాయ పరంగా కేసులు వేస్తున్న రఘురామ, కొద్ది రోజుల నుంచి సజ్జల పైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో రఘురామ పిటీషన్ దాఖలు చేయటంతో దీని పైన అధికార వైసీపీ చర్చ మొదలైంది. దీని పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications