Raghurama Raju : జల్ శక్తి మంత్రితో భేటీ-కేంద్రం జోక్యం కోరుతూ
ఏపీ-తెలంగాణ వాటర్ వార్ ముదురుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం సయోధ్య చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రమంత్రులకు, ప్రధానికీ లేఖలు రాయగా.. ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా లేఖలు రాయడంతో పాటు నేరుగా రంగంలోకి దిగి లాబీయింగ్ మొదలుపెట్టారు.
ఇన్నాళ్లూ వైసీపీతో, సీం జగన్ తో విభేదిస్తూ పార్టీకి కంట్లో నలుసుగా మారిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా స్టాండ్ మార్చారు. సీఎం జగన్ కేంద్రం ముందుపెట్టిన డిమాండ్లను సమర్ధిస్తూ నిన్న కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాసిన రఘురామరాజు ఇవాళ ఏకంగా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మరీ సమావేశమయ్యారు. ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన జల్ శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ-తెలంగాణ వాటర్ వార్ లో జోక్యం చేసుకుని తెలంగాణను కట్టడి చేయాలని సీఎం జగన్ రాసిన లేఖ తరహాలోనే తాను కూడా జల్ శక్తి మంత్రికి లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు. ఇవాళ అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో వాటర్ వార్ తో ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కేంద్ర బలగాలను ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద మోహరించాలని రఘురామరాజు కేంద్రమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. నిన్న తన లేఖలోనూ ఇదే విషయాన్ని రఘురామరాజు కేంద్రమంత్రికి వివరించారు.
Recommended Video
వైసీపీ సర్కార్ తో విభేదిస్తూ అసమ్మతి స్వరం వినిపిస్తున్న రఘురామరాజు ఇప్పుడు సీఎం జగన్ కంటే, ఏపీ ప్రభుత్వం కంటే ముందుగానే జల్ శక్తి మంత్రితో సమావేశమై ఏపీ ప్రయోజనాల కోసం చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రచారం పొందుతున్న రఘురామ ఇవాళ కేంద్రమంత్రితో భేటీ, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు జరపడం వైసీపీ, టీడీపీలో చర్చనీయాశంగా మారింది.












Click it and Unblock the Notifications