ఆయనకు కస్టడీలోనే టార్చర్-ఈయనకు అంతకు మించిన టార్చర్?
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్న వారి విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలోనూ సాఫ్ట్ కార్నర్ చూపించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్న ఒత్తిడి పెంచేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఈ టార్చర్ పెరిగిపోతోంది.
గతంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసి సీఐడీ కస్టడీలో టార్చర్ అనుభవించిన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పట్లో తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయుల్ని ఏ1, ఏ2లుగా చేర్చిన ప్రభుత్వం ఇప్పటివరకూ వారిని అరెస్టు చేయలేదు. అలాగే విచారణకు సైతం పిలవడం లేదు. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్న రఘురామరాజు బహిరంగ వ్యాఖ్యలకు దిగారు.

ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయుల్ని ఎందుకు సస్పెండ్ కూడా చేయడం లేదో ప్రశ్నించాల్సిన వారిని త్వరలోనే ప్రశిస్తానంటూ రఘురామ టీజర్ రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కచ్చితంగా వారిపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. తాజాగా ఇదే కేసులో రఘురామ గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను రఘురామ గుర్తించారు. దీంతో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది.
అయితే ఈ కామేపల్లి తులసిబాబు టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు, ఆత్మ కూడా. దీంతో టీడీపీ తులసిబాబు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రఘురామ ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన నిందితుడిని ఇంకా పార్టీలో ఉంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలోనూఅంతర్గతంగా ఎమ్మెల్యేనా, డిప్యూటీ స్పీకరా తేల్చుకోవాల్సిన పరిస్దితి చంద్రబాబుది. వెనిగండ్ల రాము ఎన్నారై. అలాగే ఆయనకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు పార్టీలో బలమైన నేతల అండ ఉంది. దీంతో రఘురామ కోసం వీరిని చంద్రబాబు వదులుకునే పరిస్దితి లేదు. ఈ నేపథ్యంలో రఘురామలో ఆగ్రహం పెరుగుతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో త్వరలో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications