రఘురామ కస్టడీ హింస కేసులో కీలక పరిణామం-సీఐడీ ఏఎస్పీకి హైకోర్టు షాక్..!
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో సీఐడీ కస్టడీలో జరిగిన హింసపై దాఖలైన కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. రఘురామ దాఖలు చేసిన కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామరాజు అప్పటి వైసీపీ సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పట్లో సీఐడీ కస్టడీలో ఉన్న ఆయన్ను రాత్రంతా చిత్రహింసలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రఘురామ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి కస్టడీ హింసను నిరూపించారు. దీంతో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఆయనపై దాడి చేసిన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న సీతారామాంజనేయులు, సీఐడీ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ తో పాటు అదనపు ఎస్పీగా ఉన్న విజయ్ పాల్ ను నిందితులుగా చేరుస్తూ రఘురామ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఏఎస్పీ విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రఘురామను తాము కస్టడీలో హింసించలేదని విజయ్ పాల్ లాయర్ చేసిన వాదన నెగ్గలేదు. దీంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.












Click it and Unblock the Notifications