నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే...: రఘువీరా ఫైర్
హైదరాబాద్: తన కుమారుడు నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైతన్య యాత్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. టిడిపి చేసేది జన చైతన్య యాత్రలు కాదనీ జన వంచన యాత్రలని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్షం వల్ల రైతులు అందరూ బాగా నష్టపోయారని రఘువీరా రెడ్డి అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కేవలం కంటితుడుపు చర్యలే అన్నారు. నిత్యావసర వస్తువులు అందడం లేదన్నారు. టిడిపి సహాయక చర్యల్లోను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బాధితులు కాంగ్రెస్ వాళ్లయితే పరిహారం ఇవ్వడం లేదన్నారు.
రెండు సీజన్లలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన అన్నారు. వరద తాకిడికి గురైన ఏడు జిల్లాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కరువు నివేదికను కేంద్రానికి పంపించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయామనే విషయంపై జన చైతన్య యాత్రలో టిడిపి నాయకులు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఎందుకు పెండింగులో పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చశారు. జన చైతన్య యాత్రలు అనకుండా టిడిపి చైతన్య యాత్రలని పేరు మార్చుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications