వైయస్‌ది చెరగని ముద్ర: రఘువీరా, పొన్నాల నివాళి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. వైయస్ 65వ జయంతి సందర్భంగా రఘువీరా రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇతర నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద ఉన్న వైయస్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. పదికోట్ల తెలుగువారి గుండెల్లో వైయస్ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.

వైయస్ ఆకస్మిక మృతిని తెలుగువారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని రఘువీరా చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు వైయస్ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఓటమిలోనూ, విజయంలోనూ వైయస్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని అన్నారు. వైయస్ బాటలో ముందుకువెళ్తామని చెప్పారు.
ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. వైయస్ చేసిన సేవలను పొన్నాలు గుర్తు చేసుకున్నారు. ఏపి, తెలంగాణ అధ్యక్షులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్‌కు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications