చరిత్రాత్మకం: కేవీపీ బిల్లుపై చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టిన రఘువీరా

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే లక్ష్యంగా పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా ఆరోపించారు. అంతేగాక, ప్రైవేటు బిల్లులతో ఒరిగేదేమీ లేదని అంటున్నారని మండిపడ్డారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రైవేటు బిల్లులు పాస్ కాలేదని చంద్రబాబు అంటున్నారని, గతంలో 14 ప్రైవేటు బిల్లులు ఆమోదం పొంది చట్టాలుగా మారాయని తెలిపారు. ఏపీకి హోదా కోసం తాము ప్రయత్నిస్తుంటే చంద్రబాబునాయుడు శకునిలా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబునాయుడికి ఓ వ్యాధి ఉందని.. ఆ వ్యాధి వల్ల మంచి పనిని ఆయన చేయరు, మరొకరు చేస్తే అడ్డుకుంటారని అన్నారు. టిడిపిలో కొందరు బిల్లుకు మద్దతు ఇస్తామంటుంటే.. మరికొందరు ఇచ్చేది లేదని చెబుతున్నారని అన్నారు. శుక్రవారం పార్లమెంటులో కాంగ్రెస్ ప్రవేశపెట్టే హోదా బిల్లు ఆమోదం పొందకపోతే చంద్రబాబును, బిజెపిని ఏపీ ప్రజలు చీదరించుకుంటారని అన్నారు.

కేంద్రం విభజన సమయంలో హోదా గురించి అడిగితే చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. రూ. 5లక్షల కోట్లు ఏపీకీ రావాలని ఉంటే.. రూ. 7వేల కోట్లేనని చంద్రబాబే చెబుతున్నారని మండిపడ్డారు. చట్టంలో లేదు కాబట్టి హోదా రాలేదని టిడిపి, బిజెపి అంటోందని ధ్వజమెత్తారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Raghuveera Reddy on AP special status bill

అందుకే కేవీపీ ఏపీకీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడుతున్నారని చెప్పారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలని తాను చంద్రబాబుకు లేఖ రాస్తే.. ఆయన టిడిపి నేత రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాసే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో ప్రమాణ స్వీకారాలకు హాజరైన చంద్రబాబు.. వివిధ రాష్ట్రాల సీఎంలతో హోదాపై ఎందుకు మాట్లాడరని రఘువీరా ప్రశ్నించారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రైవేటు బిల్లుతో ఒరిగేదేమీ లేదని, దాన్ని అడ్డుకుంటామని అంటున్నారని మండిపడ్డారు. ఏపీ ఎంపీ హరిబాబు కూడా అలాగే మాట్లాడుతున్నారని అన్నారు. శుక్రవారం తాము పెట్టే హోదా బిల్లుకు సహకరించకపోతే ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు చరిత్ర హీనులవుతారని అన్నారు.

హోదా బిల్లు పాస్ కాకపోతే అంుదకు మొదటి ముద్దాయి చంద్రబాబేనని రఘువీరా అన్నారు. టిడిపి, బిజెపిలు కలిసి హోదా బిల్లు ఓటింగ్ కు రాకుండా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం పార్లమెంటులో హోదా బిల్లుపై ఓటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని రఘువీరా చెప్పారు.

తాము ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు సీపీఎం, సీపీఐ, టిఆర్ఎస్, డీఎంకే, తదితర పార్టీలు మద్దతు పలుకుతున్నాయని రఘువీరా రెడ్డి తెలిపారు. హోదా బిల్లుకు మద్దతు ప్రకటించిన అన్ని పార్టీల ఎంపీలకు, విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రఘువీరా కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు కూడా బిల్లుకు మద్దతిచ్చారని, వారిని అభినందించారు.

శుక్రవారం మరికొందరు ఎంపీలను కలిసి హోదా బిల్లుకు మద్దతు తెలపాలని కోరతామని చెప్పారు. బిల్లు రాకుండా పోతే ప్రజల్లో టిడిపి, బిజెపిలకు విలువ లేకుండా పోతుందని అన్నారు. పిచ్చి వేషాలేయొద్దని హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలైన శరత్ పవార్, సీతారాం ఏచూరి, తదితరులు కూడా బిల్లుకు మద్దతు ప్రకటించారని తెలిపారు. ప్రైవేటు బిల్లు దేశ చరిత్రలో అమలు కాని పరిస్థితి లేదని అన్నారు.

ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా రాష్ట్రంలో యువత రోడ్లపైకి వస్తోందని రఘువీరా రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తామని జనం నమ్ముతున్నారని తెలిపారు. హోదా బిల్లు కోసం శుక్రవారం చివరి క్షణం వరకు పార్లమెంటులో పోరాటం చేస్తామని రఘువీరా స్పష్టం చేశారు.

టిడిపి, బిజెపి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం ఓ చరిత్రాత్మక దినం అవుతుందని రఘువీర అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్లానింగ్ కమిషన్ కు కూడా పంపడం జరిగిందని, అమలు పర్చాల్సి ఉందని అన్నారు. కేవీపీ ప్రవేశపెట్టే బిల్లు అందరూ సహకరించాలని కోరారు. అలా కాదంటే ప్రభుత్వమే బిల్లు పెట్టినా తమకు అభ్యంతరం లేదని రఘువీర చెప్పారు. హోదా విషయంలో కుట్రలు పన్నితే టిడిపి, బిజెపి నేతలపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh Congress president Raghuveera Reddy on Thursday responded on AP special status bill.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X