చిరు హిట్ పాటలతో కాంగ్రెస్, ఇరగదీసేవారని మెగాస్టార్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి నటించి మెప్పించిన చిత్రాలలోని సినిమాల పాటల బాణీలతో కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచారానికి ఆకట్టుకునే గీతాలను రూపొందించింది. చిరంజీవి ఈ పాటల ఆడియో సిడిలకు రూపకల్పన చేయించారు.
చిరంజీవి అభిమానుల సంక్షంలో మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఇందిర భవనంలో ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విడుదల చేశారు. పాటల తొలి చరణాలను వినిపించగానే చిరు అభిమానులు కేరింతలు కొట్టి, డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా చిరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ సమావేశం కాబట్టి క్రమశిక్షణతో ఉన్నారు.. వదిలితే విరగదీసి ఉండేవారేమోనని చిరు అన్నారు. పాటలు బాగున్నాయని చిరు కితాబిచ్చారు. ఇందిర, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, సోనియా పదవిని త్యాగం చేశారని, రాహుల్ గాంధీ అధికారంలోకి రావాల్సిందనే పాట తనకు బాగా నచ్చిందన్నారు.
చిరంజీవి ఎక్కడ ఉంటే అభిమానులు అక్కడేనని, సభ్యత్వ నమోదు అనేది సాంకేతిక అంశమే అన్నారు. పది లక్షళ మంది అభిమానులను పార్టీ సభ్యులుగా చేరుస్తామని చెప్పడం సంతోషమన్నారు. అభిమానులు అంటే సామాజిక కోణంలోను ఆలోచించాలని సూచించారు.
రాజకీయాల్లోకి వచ్చే వారికి ప్రాధాన్యం ఉంటుందని పరోక్షంగా చెప్పారు. సామాజిక మీడియాను వినియోగించడం ద్వారా కాంగ్రెసు అంటే ఏమిటో చెప్పాలన్నారు. తాము చిరు వెంటే ఉంటున్నామని చిరు అభిమానం సంఘం నేత ఆర్ స్వామినాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications