చిరుతో కలిసి నవారు మంచంపై రాహుల్ 'అనంత' రుచులు
అనంతపురం: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో శుక్రవారం అనంతపురం జిల్లా స్థానిక వంటకాలను రుచి చూశారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో నులక మంచంపై కూర్చుని ఆయన స్థానిక వంటకాలను భుజించారు. ఆయన శుక్రవారంనాడు అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ఓబుళదేవర చెరువు గ్రామం నుంచి తన పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ కొండకమర్ల గ్రామంలో ముగించారు. కొండకమర్లలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. రైతు కూలీలు వెంకటరమణమ్మ, రవిల ఇంటిలో అడుగు పెట్టారు. ఇరుకు సందులను దాటుకుంటూ అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను దాటుకుంటూ ఆయన ఆ ఇంటికి చేరుకున్నారు.

మధ్యలో మురుగు కాలువను కూడా దాటారు. రాహుల్ కోసం వెంకటరమణమ్మ రాగిముద్ద, పప్పు, అలసంద వడలు తయారు చేసింది. వెంకటరమణమ్మ ఇంటి వద్ద నవారు మంచంపై కూర్చుని రాహుల్ గాంధీ చిరంజీవితో కలిసి ఆ వంటకాలు భుజించారు. మాజీ మంత్రి శైలజానాథ్ వారికి దగ్గరుండి వడ్డించారు.
ఓబుళదేవర చెరువు నుంచి కొండకమర్ల వరకు 10 కిలోమీటర్లు రాహుల్ పాద యాత్ర చేశారు. ఆయన వెంట చిరంజీవితో పాటు ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తదితరులు ఉన్నారు. ఢిల్లీకి వెళ్లేముందు పుట్టపర్తి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నరేంద్ర మోడీ, వైయస్ జగన్‌లపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications