విశాఖ డ్రీమ్ ప్రాజెక్ట్ పై కేంద్రం మరో జలక్ - ఇదీ సంగతి..!!
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. పునిర్విభజన చట్టం ఆమోదించి ఎనిమిదేళ్లు పూర్తయింది. కానీ, విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కేంద్రానికే అంచనాలు లేవు. ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేమంటూ రైల్వే శాఖ తేల్చి చెప్పింది. దీంతో, ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం లేదనేది స్పష్టం అవుతోంది. ఇంకా సమీక్ష దశలోనే ఉందంటూ బాంబు పేల్చింది. ఇటు మూడేళ్ల కాలంలో రైల్వే జోన్ కోసం ఖర్చు చేసింది రూ 14 లక్షలు. కావాల్సింది రూ 170 కోట్లు కాగా, కేటాయించింది రూ 3.80 కోట్లు. దీంతో, జోన్ అందుబాటులోకి రావటం ఇప్పట్లో సాధ్యమేనా అనే సందేహం మొదలవుతోంది.
విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి డీపీఆర్ ఇంకా సమీక్ష దశలోనే ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీంతో జోన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్టమైన గడువును చెప్పలేమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. తాజాగా రైల్వే జోన్ డీపీఆర్ తాజా స్థితితో పాటుగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు పై తాజా సమాచారం కోరుతూ వచ్చిన దరఖాస్తుకు ఈ తరహాలో సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో పార్లమెంట్ లోనూ విశాఖ రైల్వే జోన్ పైన ప్రశ్నలు వచ్చాయి. రైల్వే జోన్ ఏర్పాటుకు రూ 170 కోట్లు అవసరంగా కాగా, రూ 3.80 కోట్లు కేటాయించారు. అందులోనూ రూ 14 లక్షలు ఈ మూడేళ్లలో ఖర్చు చేసారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ అడిగిన ప్రశ్నకు అధికారికంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సమాధానం ఇచ్చారు.

దీనికి కొనసాగింపుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన పనులను గత నవంబర్ 10న రూ 106.89 కోట్ల అంచనాతో మంజూరు చేసామని రైల్వే మంత్రి వెల్లడించారు. 202-21 బడ్జెట్ లో ప్రతిపాదనల్లో భాగంగా వీటిని ఇచ్చినట్లు తెలిపారు. ప్రధాన కార్యాలయ నిర్మాణానికి భూమిని గుర్తించామని చెప్పారు. నిర్మాణ ప్రక్రియలో భాగంగా ప్రధాన కార్యాలయం, ఉద్యోగుల నివాసాల సముదాయం, నిర్మాణానికి ముందు పూర్తి చేయాల్సిన మొత్తం లే అవుట్ ప్లాన్ తయారీ చేపట్టాలని ఆదేశించామని వెల్లడించారు. దీంతో, అసలు విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు అధికారికంగా అందుబాటులోకి వస్తుంది.. విశాఖ ప్రజల డ్రీమ్ ప్రాజెక్టు ఎప్పుడు వాస్తవంలోకి వస్తుందనేది చర్చకు కారణం అవుతోంది.












Click it and Unblock the Notifications