తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్, రూట్- ముహూర్తం ఫిక్స్ : ఇక ఏడు గంటల్లోనే...!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండు వందేభారత్ రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది. రెండు ఐటీ నగరాల మధ్య వందేభారత్ పట్టాలెక్కనుంది. కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ద్వారా ఏడు గంటల్లోనే బెంగళూరు చేరుకొనే అవకాశం కలుగుతుంది. ఈ రైలుకు సంబంధించి ఈ రోజు అధికారులు ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఐటీ సిటీల మధ్య వందేభారత్:హైదరాబాద్ - బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య వందేభారత్ పట్టాలెక్కనుంది. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఆగస్టు 6న ఈ రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు అంచనాలు మించి ఆదరణ లభిస్తోంది.

మరో రెండు రైళ్లను సికింద్రాబాద్ నుంచి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ముందుగా కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ అందుబాటులోకి రానుంది. ఈ రోజు జరిగే ట్రయిల్ పూర్తి అయిన తరువాత అధికారికంగా రూట్, సమయాలను ప్రకటించనున్నారు.
ఏడు గంటల్లోనే బెంగళూరుకు:నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది. హైదరాబాద్ - బెంగళూరు రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ రెండు సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల వరకు సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 7 గంటల్లో గమ్యస్థానం చేరుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకొనేలా రూట్ ఖరారు చేసారు.ట్రాక్ సామర్ధ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. రూట్ షెడ్యూల్ పైన దాదాపు క్లారిటీ రావటంతో, టైమింగ్స్ పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరో రెండు రైళ్లకు కసరత్తు:రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా దేశ వ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సుమారు ఏడు రైలు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. నిత్యం ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. ఈ లైన్ లో ఉన్న డిమాండ్ కారణంగా వందేభారత్ ఏర్పాటు చేయటం ద్వారా ఆదరణ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు వారాంతంలో ఈ రూటులో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుతో పాటుగా సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ ప్రారంభానికి అధికారులు సిద్దం అవుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications