ఫలక్ నుమా ప్రమాదం, 7 కోచ్ లు దహనం- పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు..!!
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బొమ్మాయపల్లి - పగిడిపల్లి మధ్య రైలులో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా పొగ అలముకుంది. దీంతో ప్రయాణీకులు ఏం జరుగుతుందో అర్దం కాలేదు. వెంటనే చైన్ లాగి రైలును ఆపటంతో వెంటనే అందరూ కిందకు దిగేసారు. ఏడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. ప్రమాదం పైన అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో , ఈ లైన్ లో ప్రయాణించే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసారు.
మంటల్లో రైలు బోగీలు : మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పగలు సమయం కావటంతో ప్రమాదం గుర్తించారు. అసలు ఇంత భారీ ప్రమాదానికి కారణమేంటనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదమని చెబుతున్నారు. గుంటూరు డివిజన్ లో సికింద్రాబాద్ రూట్ లో నల్గొండ జిల్లా పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు దహనమయ్యాయని అధికారులు నిర్దారించారు. ప్రయాణీకులు అంతా సురక్షితంగా ఉన్నారు. ఉదయం సమయం కావటంతో ప్రయాణీకులు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నారు. దహనమైన బోగీలను వదిలేసి రైలు సికింద్రాబాద్ చేరుకుంది.

దారి మళ్లింపు...రద్దు : ఈ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి రేపల్లే వెళ్లే డెల్టా ఎక్స్ ప్రెస్ ను ఈ రోజు రద్దు చేసారు. అదే విధంగా సాయంత్రం సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్లాల్సిన అజంతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నర్సాపూర్- నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ ను కాజీపేట..విజయవాడ మీదుగా దారి మళ్లించారు. హైదరాబాద్ - త్రివేండ్రం శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను కాజీపేట..విజయవాడ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ నుంచి లింగంపల్లి వరకు పయాణించే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను కాజీపేట..వరంగల్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోనుంది. అదే విధంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్ నుంచి హౌరా బయల్దేరాల్సిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ను కాజీపేట..వరంగల్ మీదుగా దారి మళ్లించారు.

ఏడు కోచ్ లు దహనం : ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులు రైలు నుంచి దిగిపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లు మంటలను నియంత్రించే ప్రయత్నం చేసాయి. రైల్వే అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఒక అంగతకుడు గతంలో రాసిన లేఖలో పేర్కొన్నట్లుగానే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారాన్ని రైల్వే అధికారులు ఖండించారు. ప్రమాదానికి కారణాలను విచారణలో తేలుస్తామని వెల్లడించారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు. ఈ రోజు వరకు రైళ్ల రద్దు...దారి మళ్లింపు ఉంటుందని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications