ఇక ఏ రైలూ ఆగదు - రాష్ట్రంలో 23 రైల్వే స్టేషన్ల మూసివేత..!!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 23 రైల్వే స్టేషన్లను మూసివేసారు. రైల్వే స్టేషన్లను, రైళ్లను ఆధునీకరిస్తున్నామని చెబుతూ ఇప్పుడు ఏకంగా రైల్వే స్టేషన్లనే మూసేస్తున్నారు. ఈ స్టేషన్లలో టికెట్ కౌంటర్ల ఎత్తివేతకు నిర్ణయించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసారు. ప్రయాణీకుల సేవలు కంటే పూర్తిగా కమర్షియల్ గా ఆలోచనలు చేస్తున్న రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
స్టేషన్ల మూసివేత
ఏపీలోని క్రిష్ణా....ఉభయ గోదావరి జిల్లాలోని 23 రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ మూసేసింది. ప్రయాణికులు రావడం లేదే కారణం చూపుతూ రైల్వే కార్యకలాపాలు నిలిపివేసింది. ప్రభుత్వం రైలు మార్గాలను ప్రైవేటీకరిస్తూ ప్రైవేట్ రైళ్లు నడపడానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఈ 23 స్టేషన్లను మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టేషన్లలో ఇక నుంచి రైళ్ల హాల్టింగ్ సౌకర్యం ఉండదు. ఈ స్టేషన్లలో ఇప్పటి వరకు టికెట్ కౌంటర్లు ఉన్నా.. ఆదరణ లేకపోవటంతో మూసివేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆదరణ లేకపోవటమే
విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ఎస్జీ -6 కేటగిరీలో ఉన్న 16 స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసారు. అభ్యంతరాలు రాకపోవటంతో అల్లూరు రోడ్డు, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద, నవాబ్ పాలెం, పెన్నాడ అగ్రహరం, పెద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేసారు.
వీటితో పాటుగా కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణ గూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతపర్రు స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల మూసివేతకు రైల్వే అధికారులు పలు కారణాలు చెబుతున్నారు. కనీసం రోజుకు 25 మంది ప్రయాణీకులు కూడా ఈ స్టేషన్లకు రావటం లేదని విశ్లేషిస్తున్నారు.

సుదీర్ఘ చరిత్ర ఉన్న స్టేషన్లు
ప్రస్తుతం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న స్టేషన్లలో కొన్ని బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. ఈ స్టేషన్ల సమీపంలోని గ్రామాల ప్రజలు రైళ్లనే ప్రయాణ సాధానాలుగా నమ్ముకున్నారు. గ్రామాల ప్రజలతో పాటుగా వ్యాపారులు ,ఉద్యో గులు రైళ్లనే నమ్ముకునేవారు. పశివేదల స్టేషన్ కూడా ముఖ్యమైనదే. ప్రస్తు తం ఇక్కడ ఐదు రైళ్లు ఆగుతున్నాయి.
త్వరలో ఈ స్టేషన్‌ను కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం తర్వాత జిల్లాలో ముఖ్యమైన కొవ్వూరు స్టేషన్ కూడా నిర్వీర్యమైపోతోంది. ఇక్కడ మూడు నాలు రైళ్లు తప్ప ఏవీ ఆగడం లేదు. దాదాపు వంద గ్రామాల ప్రజలు ప్రయాణించే అవకాశం ఉన్నా స్టేషన్‌లో రైళ్లు ఆగకపోవడంతో ఖాళీగా ఉంటుంది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో ఈ స్టేషన్లు బోసిపోయాయి.












Click it and Unblock the Notifications