తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్- రూట్ ఫిక్స్..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సైతం డిమాండ్ ఉన్న రూట్లలో వందేభారత్ కేటాయింపు కోసం రైల్వే శాఖతో సంప్రదింపులు చేస్తు న్నారు. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల మీదుగా వందేభారత్ స్లీపర్ రావటం దాదాపు ఖాయమైంది. రూటు పైన స్పష్టత వచ్చింది. ఈ మేరకు కసరత్తు తుది దశకు చేరుకుంది.
తొలి వందేభారత్ స్లీపర్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. అయిదు వందే భారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్దం కానున్న వేళ వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేసారు. అందులో తెలుగు రాష్ట్రాలకు ఒకటి కేటాయించేలా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి రూట్ పైనా స్పష్టత వచ్చింది. ఈ రైళ్లలో ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి.

విజయవాడ టు అయోధ్య
ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అయితే, తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ రెండు ప్రతిపాదనల్లో ప్రయాణీకుల డిమాండ్.. రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటా యింపు ఖాయంగా కనిపిస్తోంది.
రెండు వందేభారత్ రైళ్లు
ఇదే సమయంలో ఏపీకి కొత్తగా వందేభారత్ రైళ్ల కోసం పార్లమెంట్ వేదికగా ఎంపీలు డిమాండ్లను రైల్వే శాఖ ముందుంచారు. నెల్లూరు, మైసూర్ మధ్య తిరుపతి మీదుగా కొత్త వందేభారత్ రైలును ప్రారంభించాలని అరకు ఎంపీ తనూజ రాణి రైల్వే మంత్రిని అభ్యర్థించారు. తిరుపతి, విశాఖ పట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలును కూడా నడపాలని ఆమె అభ్యర్థించారు. ఏపీలో నడుస్తు న్న రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచాలని, అలాగే కొత్త వందే భారత్ రైళ్లను పెంచాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి కేటాయించిన 73 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని, ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. దీంతో.. త్వరలో తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ స్లీపర్.. మరి కొద్ది నెలల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications