ఈ రూట్లలో వందేభారత్ టికెట్ ధరలు తగ్గింపు..!!
ఇప్పుడు రైల్వేల్లో వందేభారత్ హవా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరి కొన్ని సర్వీసులు ప్రారంభించేందుకు సిద్దం అయ్యాయి. ప్రారంభించిన పలు రైళ్లు అంచనాలకు మించి ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. కొన్ని రైళ్లకు ఆదరణ కనిపించటం లేదు. తక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ సర్వీసుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, ప్రయాణీకులను ఆకట్టుకొనేందుకు ధరల తగ్గింపు యోచన అధికారులు మొదలు పెట్టారు.
వందేభారత్ టికెట్ ధరలపై ఆలోచన:వందే భారత్ రైళ్లు చాలా వరకు 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. ఇండోర్- భోపాల్, భోపాల్ - జబల్ పూర్, నాగ్ పూర్ - జబర్ పూర్ వందే భారత్ రైళ్లు ఈ కేటగిరీ కింద గుర్తించారు. జూన్ నెలకు సంబంధించి ఆయా రైళ్ల ఆక్యెపెన్సీని పరిశీలిస్తే 21-29 శాతం మధ్య ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇండోర్ - భోపాల్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు కాగా, ఏసీ ఛైర్ కార్ కు రూ 950, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ 1525గా ఉంది. అయితే ఆయా రైళ్ల టికెట్ ధరలను సమీక్షించాలని రైల్వే నిర్ణయించింది.
ఆదరణ లేని సర్వీసులకు వర్తించేలా:భోపాల్-జబల్ పూర్ వందేభారత్ లో 32 శాతం ఆక్యుపెన్సీ ఉంది. అదే విధంగా జబల్ పూర్ - భోపాల్ వందేభారత్ ఆక్యుపెన్సీ రేషియో 36 శాతంగా ఉంది. ఈ రూట్ లో కూడా టికెట్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ రూట్ లో టికెట్ ఛైర్ కార్ టికెట్ ధర రూ 1055 కాగా..ఎగ్జిక్యూటివ్ ధర రూ 1880 గా ఉంది.
దీంతో ఇప్పుడు ఈ రూట్ లోనూ టికెట్ ధరల ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో పలు వందేభారత్ సర్వీసులు వంద శాతంకు పైగా ఆక్యుపెన్సీ రేషియోతో దూసుకువెళ్తున్నాయి. కాసర్ గోడ్ - త్రివేండ్రం 176 శాతం, గాంధీనగర్ - ముంబాయి సెంట్రల్ రైలు 134 శాతం, ముంబాయి సెంట్రల్ - గాంధీనగర్ 129 శాతం, వారణాశి - న్యూఢిల్లీ 128 శాతం తో పరుగుతు తీస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం:ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో టికెట్ ధరలు యథాతధంగా కొనసాగనున్నాయి. ఆదరణ లేని రూట్లలో మాత్రం తగ్గే అవకాశం కనిపిస్తోంది. తగ్గించటం ద్వారా ఆదరణ పెరిగితే సర్వీసుల కొనసాగించటం.. అప్పటికీ సాధ్యం కాకుంటే వేరే మార్గాలకు మళ్లించటం వంటి ప్రతిపాదనలు సిద్దం అయినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని తెలుస్తోంది. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications