సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. రెండు రైళ్లకు రైల్వే శాఖ అంచనాలకు తగినట్లుగా ఆక్యుపెన్సీ రేషియా నమోదు అవుతోంది. దీంతో, ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా మరింత వెసులుబాటు కలిగించేలా రైల్వే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ లో సీట్ల ను రెట్టింపు సంఖ్య లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో మరో ప్రతిపాదన పరిశీనలో ఉంది.
పెరిగిన ఆక్యుపెన్సీ:సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ ప్రారంభమైంది. ఆ రైలుకు ఇప్పటి వరకు అంచనాలను మంచి ఆక్యెపెన్సీ రేషియో నమోదు అవుతోంది. ఇదే సమయంలో రెండో రైలుగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రారంభమైంది. దీనిని ప్రధాని మోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభమైన సమయం నుంచి ఈ రైలుకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతికి కేవలం ఆరున్నార నుంచి ఏడు గంటల్లోగానే వందేభారత్ ద్వారా చేరుకుంటున్నారు. ఈ రైలుకు ఇప్పటి వరకు 8 కోచ్ లతో నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ తో దక్షిణ మధ్య రైల్వే తాజాగా పంపిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

కోచ్ ల సంఖ్య రెట్టింపు:సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు సీట్ల సంఖ్య పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 కోచ్ లను 16కు పెంచింది. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ చైర్‌కారులో 52 సీట్లు, చైర్ కారులో 478 సీట్లు వెరిసి మొత్తంగా 530 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. ఏప్రిల్ 8న ప్రారంభం అయిన ఈ రైలు ఇప్పటి వరకు సాధించిన ఆక్యెపెన్సీ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్‌లో ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ 131 శాతంగా నమోదు కాగా.. మేలో ఈ 10 రోజుల్లో అది కాస్తా 134 శాతంగా నమోదైంది. దీంతో, వెంటనే కోచ్ లు పెంపు ప్రతిపాదనకు ఆమోద ముద్ర లభించింది. సీట్లు డబుల్ సంఖ్యలో అందుబాటులోకి రావటంతో ప్రయాణీకులకు వెసులుబాటుగా మారనుంది.
హాల్టింగ్స్ పెంపు సాధ్యమేనా:ఇదే సమయంలో మరో కొత్త ప్రతిపాదన తెర పైకి వచ్చింది. వందేభారత్ కు పెరుగతున్న ఆదరణ వేళ తిరుపతికి వెళ్లే రైలు నిలిపే స్టేషన్ల సంఖ్య పెంచాలంటూ అభ్యర్దనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్ లో ప్రారంభమైన తరువాత నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు తరువాత నేరుగా తిరుపతి చేరుకుంటుంది. విశాఖ నుంచి చెన్నై వచ్చే రైళ్లతో పాటుగా ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు వెళ్లే రైళ్లకు తెనాలి స్టేషన్ కీలకం కావటంతో తెనాలిలో వందేభారత్ కు హాల్టింగ్ కల్పించాలనే అభ్యర్దన రైల్వే శాఖకు చేరింది. అదే విధంగా మరో ప్రధాన జంక్షన్ గూడూరు వద్ద రైలు ఆగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. దీని పైన రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications