తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
తిరుపతి ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ వేళ.. తిరుపతికి కొత్త సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు రైల్వే శాఖకు పలు వినతులు అందించారు. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే ఈ రెండు రైళ్ల పైన అధికారికంగా ప్రకటన చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇస్తోంది. విశాఖ నుంచి ఎంతో కాలంగా తిరుపతి కి వందేభారత్ రైలు కేటాయించాలనే డిమాండ్ పెండింగ్ లో ఉంది. అయితే, ఈ రూట్ లో వందే భారత్ స్లీపర్ కేటాయించాలనేది రైల్వే శాఖ ఆలోచన. ఇప్పుడు రెండో విడత వందే భారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపులో విశాఖ నుంచి వందేభారత్ స్లీపర్ విశాఖ - తిరుపతి మధ్య ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖరారు పైనా తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ ఉన్నా... అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డిమండ్ పెరుగుతోంది. దీంతో.. సికింద్రాబాద్ నుంచి కొత్తగా కేటాయింపు పైన త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ఎంపీల ప్రతిపాదన.. రైల్వే శాఖ కసరత్తు
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ చార్జీతో వందేభారత్ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో రైల్వేశాఖ కొత్తగా పలు అమృత్‌భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో నాలుగు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. చర్లపల్లి- తిరువనంతపురం (కేరళం), చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్(తమిళనాడు)కు, ఈ నెల 18న చర్లపల్లి నుంచి అసోం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్యకు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. కాగా, ప్రయాణీకుల నుంచి ఈ రైళ్లకు వస్తున్న వంద శాతం ఆక్యుపెన్సీ కారణంగా మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ కోసం పలు మార్లు ఎంపీలు రైల్వే శాఖను కోరారు. అయితే.. విశాఖ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం డిమాండ్ ఉంది. దీంతో.. విశాఖ నుంచి వందేభారత్ స్లీపర్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అమృత్ భారత్ పైనా కసరత్తు జరుగుతోంది. త్వరలోనే ప్రకటన రైల్వే అధికారికంగా చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications